పుట:SamardaRamadasu.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము

బాల్యము - ఉపదేశము

నారాయణుడు చిన్నవాఁడు. అల్లారుముద్దుగాఁబెరిగెను. అతని మొగమెప్పుడు చిఱునగవుతో వెలయుచుండెను. ఏడుపన్న దేమో యతడెఱుఁగఁడు. రెండేళ్ళు వెళ్లునప్పటికి మాటలు వచ్చెను. వయస్సు ముదిరిన కొలఁది బుద్ధికుశలతయు దానితో యుక్తాయుక్త వివేకమునలవడెను. భవిష్యత్కాలమున నతనిసాహసములు చిన్ననాఁటి యల్లరిపనులవల్లనే యూహింపఁదగియుండెను. అతనికి దయ్యములన్న భూతములన్న నమ్మకము లేదు. తన దుండగములు సహింపక తల్లిదండ్రులు బెదిరించినప్పుడు వారి బిభీషికలకు భయపడువాఁడు కాఁడు. పిల్లలల్లరిపనులు చేయునప్పుడు వారిని భయపెట్టుటకై చెప్పెడు భూతపిశాచముల కథలనతఁడు లెక్క చేయువాఁడు కాఁడు. ఆటలన్న నతనికి అత్యంత ప్రేమ. స్వేచ్చావిహార మతని ప్రకృతి. ఆ గ్రామమందలి బాలురంద ఱతని సహచరులైరి. అతఁడు వారి నాయకుఁడయ్యెను. ఈ పిల్లల కొంటెతనములు కోతి కొమ్మచ్చి మొదలయిన యాటలు పూర్వము రామాయణములోఁజెప్పఁబడిన బవానరుల చేష్టలవలెనుండెను. నారాయణుడు తనయనుచరుల హృదయములు రంజినంపఁజేసెను. అందుచేత నతఁడేమి చెప్పిననది వారు తప్పక చేయుచుండిరి. గోడల మీఁదనుండి దూకుట, నదులీఁదిదాఁటుట, యొకచెట్టుమీఁద నుండి మరియొక చెట్టుమీఁదకు దుముకుట మొదలైనవి జాంబు నగరమున నీ చిన్నియన్నల చేష్టలలోఁ గొన్ని, నారాయణుఁడింటివద్ద చేయునట్టి దుండగములనుండి తప్పించుకొనుటకు సూర్యాజీ తన కుమారుని యా గ్రామమున నొక పాఠశాలకుఁబంపెను. ఆ యుపాధ్యాయుఁడు విశేష విద్యావంతుఁడుకాడు. అతఁడు నేర్చుకొన్న విద్యనంతయు నారాయణుఁడు రెండు సంవత్సరములలోనే గ్రహించెను.

2