పుట:Sakalaneetisammatamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ప్రథమముద్రణము

ఉపోద్ఘాతము

—:౦:—

రాజ్యాంగములలో సకలవర్గంబుల వారును బరస్పరము ప్రవర్తింప వలసిన నీతిమార్గమును సకలగ్రంథసమ్మత మగునట్టిదిగా నేర్చి దీని సకలనీతిసమ్మత మనుపేర మడికి సింగన కూర్చె. ఇంచుఁ జేర్పనుద్దేశించిన నీతివర్గముల గ్రంథారంభముననే (17వ సంఖ్య గద్యమున) కవి వివరించె నందు "అధికాధమవిరోధభేదంబుసు" అనునంతకుఁ గల మూఁడాశ్వాసముల గ్రంథమె మనకు లభింపఁగా నిందు ముద్రింపఁగడంగితిమి. పైభాగము సహితము లభించునేని వాాఙ్మయమునకు నిక్కముగాఁ బెంపుగలుగును. ప్రతిజ్ఞాతవిషయములో రాజనీతిభాగము మూఁడాశ్వాసములనె ముగియుచుండుటవలనను దక్కినభాగములో లోకోక్తిసంగీతనాట్యవిషయమును బూజాప్రతిష్ఠాధ ప్రశంసలుసు గలవగుటచే నీగ్రంథమును మొదట వ్రాసికొనిన వారు దాని ససంబద్ధమని వదలి యుందురేమో.

మడికి సింగన గోదావరిప్రాంతమున నుండు పెద్దమడికి నివాసియయ్యును నోరుగల్లున కుత్తరమున నుండు రామగిరి పట్టణమున కవీశ్వరుండగు కందనమంత్రి కాశ్రితుఁడై బహుగ్రంథముల రచించె. వానిలోఁ బద్మపురాణము, భాగవత దశమస్కంధము (ద్విపదకావ్యము), వాసిష్ఠరామాయణము మనకు లభించుచున్నవి. దశమస్కంధభాగము తంజాపురి పుస్తకభండారమున నాద్యంతములు లేక యొకమాతృక గలదు. తక్కినవి ముద్రితములైనవి. కందనమంత్రిపేర నీతితారావళియని యొకగ్రంథము సింగన రచియించినది నేటికిఁ గానరాదు. సింగన సకలనీతిసమ్మతమున దానిలోనుండి పెక్కుపద్యము లుదాహరించుకొనెను. మడికి సింగన యుండినకాలము పద్మపురాణరచనాకాలము తెలిసినందునఁ జిక్కులు లేక విస్పష్ట సుగుచున్నది.

"ఆకరయుగాసలమృగాంకశకవత్సరయులై పరఁగు శాశ్వరిని బుణ్య
ప్రాకటితమార్గశిరపంచమిని బొల్చు నుడుపాలసుతవాసరమునందున్
శ్రీకరముగామణికి (మడికి) సింగన దెనుంగున రచించెఁ దగఁ బద్మపురాణం
బాకమలమిత్రశిశిరాంశువుగఁ గంద సచివాగ్రణికి మంగళమహాశ్రీ."