ఉ. మంత్రవివేకి యౌనతఁ డమందజయంబునఁ బొందు నెంతయున్
మంత్రవిహీనుఁ డైన నవమానముఁ బొందు సమర్థుఁ డేని దు
ర్మంత్రు నరాతు లోర్తు రౌగి రాక్షసు లధ్వరశీలునట్ల స
న్మంత్రుని నోర్వరా దగుట మంత్రవరుం డగు టొప్పు నెప్పుడున్. 711
కామందకము
ఉ. నీతిపథంబునన్ బ్రతుకనేర్చుట యుత్తమబుద్ధి కార్యసం
జాతములై కరం బలరుసంపద నొందుట మధ్యవృత్తి య
స్ఫీతము లైన బారవహజీవనముల్ తలపం గనిష్ఠముల్
నీతికి బాహ్యులైన ధరణీవర మెత్తురె వారి నుత్తముల్. 712
విదురనీతి
గీ. సూక్ష్మబుద్ధి జనులచొప్పున వర్తించు
వాని కాప్తజనవిహీన మైన
తఱి విచారమునకుఁ దక్కటుజను లేల
తనకుఁ దాన బుద్ధి గనఁగవలయు. 713
చ. కినుకను దుష్టవేదన మొగిం గొను టెంతయు దుష్కరంబు గా
కనుపమనీతికోవిదుల కారయ నెందు నసాధ్య మొందునే
ఇనుమును నీరుగాఁ గరఁగరే మదకుంజరమస్తకంబునం
దొనర మదంబు వెట్టరె సమున్నతవృత్తి నుపాయసంపదన్. 714
ఆ. పెద్దయయిన యినుపముద్ద దా నొకలేఁత
తీవనైన నెట్లు త్రెంపనేర్చు
నల్పమైన నదియు నతిశితధారచేఁ
ద్రెంప నోపు నెంతదృఢమునైన. 715
క. నీరున ననలం బాఱుట
నారయ లోకప్రసిద్ధ మయ్యనలముచే
నీరు గడు దోష మొందదె
చారుతరోపాశక్తిసంపదవలనన్. 716
ఆ. అంధకారంబునప్పుడు నడఁగిపోదు
దినపతేజంబునప్పుడు తిరిగి రాదు
యెట్టిమఱుఁగైనఁ గాన్పించు నెచట నున్నఁ
జారుతర మైనయట్టి విచారదృష్టి. 717
ముద్రామాత్యము
క. వాయువు దూఱనిచోటును
దోయజబాంధవునిరశ్మి దూఱనిచోటన్
ధీయుతులబుద్ధి దూఱు ని
రాయాసంబును గార్య మగుఁ దుద్బుద్ధిన్. 718