పుట:Sakalaneetisammatamu.pdf/192

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. దేశకాలాంతరస్థితి నెఱుంగఁగరాని
పనివెంట విజ్ఞాన మనఁగఁ జెల్లు
నెఱిఁగిన పని బుద్ధి నెంతయు నూహించి
నెఱితథ్య మెఱుఁగుట నిశ్చయంబు
ఇరువురపై నెత్తి యరుగంగవలయుచో
హితమంత్రివరుల నూహించి చూచి
అందులో నొకనిపై నరుగ నిశ్చయ మొగిఁ
జేఁత సందేహవిచ్ఛేదనంబు
గీ. అడఁగు శత్రువుపై నెత్తి యరుగునపుడు
సంధివిగ్రహములయందు సంధి యధిక
మట్టిసంధియు భేదంబునంద యైనఁ
దనరు ననుట యశేషసందర్శనంబు. 706

క. నరపతులకు నెక్కాలముఁ
బరికింపఁగవలయు మంత్రపంచాంగములన్
వరనీతిజ్ఞులమతమున
వెరవుగ వివరింతు దాని విధ మె ట్లనినన్. 707

గీ. పటుసహాయము సాధనోపాయములును
దేశకాలవిభాగవిధిజ్ఞతయును
ఘనవిపత్ప్రతీకారంబు కార్యసిద్ధు
లనఁగ నొప్పగు మంత్రపంచాంగకములు. 708

సీ. దుర్గకృత్యమునకుఁ దొలుత సహాయాధి
కారులు పనిసేయు భూరిజనులు
పరశుకుంతాదులు బలుసాధనంబులు
నడుభూమి గడు నొండెఁ గడఁగి దుర్గ
మొనరించుటయు గ్రీష్మమున నిష్టకాదులు
వర్షకాలము కారువర్గకృత్య
మోలిఁ జేయుట దేశకాలవిభాగంబు
లాధర్వసామభేదాద్యుపాయ
ఆ. విధుల నాపదలకు వెస శాంతి నంతవి
ఘ్నప్రతిక్రియ యనఁ గలము వెలుఁగు
కార్యసిద్ధిఫలము లార్యులు మంత్రపం
చాంగ మందు దీని నండ్రు ప్రీతి. 709

సీ. శాశ్వతబుద్ధిమై జరుగు నాతనిబుద్ధి
యమర నౌత్పాదికి యనఁగఁ బరఁగు
శాస్త్రంబువలనఁ దా సంభూత మగుబుద్ధి
ఘనశాస్త్రసంభవం బనఁగఁ బరఁగు
జ్ఞానవృద్ధులతోడి సంసర్గ మగుబుద్ధి
సాంసర్గి యనఁగఁ బ్రశస్త మగును
మును పల్కి మఱియుక్తి యొనరింప
బుద్ధియై నది పరిణామిక యనఁగవలయు
గీ. నిట్టిబుద్ధులు నాలుగు నెసగు మంత్రి
శక్తి కరయ నాధారమై చనుటఁ జేసి
నీతిమంతులు సెప్పుదు రాతతముగ
రాచకృత్యంబు లివి యని రాజితముగ. 710