పుట:Sakalaneetisammatamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. అరయసత్యార్థధార్మికానార్యనృపులు
భ్రాతృసంఘాతవంతుండు బలఘనుండు
ననుపమానైకవిజయుండు ననఁగ నేడ్వు
రొప్పుదురు సంధి సేయంగ యోగ్యు లగుచు. 541

ఉ. సత్యుఁడు సత్యవాఙ్నియతసంహితుఁడై వికృతుండు గాఁడు ప్రా
ణాత్యయమైన నార్యుఁడు ననార్యతఁ బొందఁడు యుక్తకారియై
సత్యము ధార్మికప్రభుఁ డసాధ్యుఁడు ధర్మజనానురాగసాం
గత్యము యుద్ధసాధనము గావున సంధి యొనర్చు టొ ప్పగున్. 542

చ. తొడగి యసాధ్యుఁ డైన నృపుతోఁ దగు సంధి యొనర్పకుండినన్
గడఁగి తదీయశత్రువులఁ గైకొని వచ్చి యయుక్తకారయై
యడఁచు సమూలకందముల నారయ భ్రాతృసమేతుఁ డొప్పు బ
ల్విడిఁ బటుకంటకాకలితవేణునికుంజమున ట్లసాధ్యుఁ డై. 543

సీ. బలవంతుఁ డెంతయుఁ బైనెత్తి వచ్చిన
నే యత్నములు మఱి యేమి సేయు
హరివరాధిష్ఠతవారిణంబునకుఁ బోలె
నమ్మేటి దగు శరణమ్ము గలదె
మార్కొననోడిన మత్తగజేంద్రంబు
నొడియు సింహముఁ బోలె నొప్పుగొనఁడె
బలవంతుతోడ నెబ్భంగినైనను
బోరు మనుచుఁ జెప్పెడి నిదర్శనము గలదె
గీ. యుఱక పెనుగాలి కెదురుగాఁ దఱమవశమె
కాన శుభకాంక్షియైన భూకాంతుఁ డెపుడు
త్రివిధశక్తిసమగ్రుఁ డేతెంచెనేని
సంధి యగునది కార్య మసంశయంబు. 544

క. బల్లిదునకుఁ బ్రణమిల్లుచు
మెల్లన కాలముల విక్రమించెడి జనులం
దెల్లెడఁ బాయవు సంపద
లల్లన జలరాశిఁ బొందునాపగలక్రియన్. 545

చ. ఒనర ననేకయుద్ధవిజయుం డగురాజు ప్రతాపవహ్నిచే
నని రిపుకోటిఁ గ్రాఁచుజమదగ్నితనూభవునట్ల వారితో
ననువుగ సంధి చేసికొని యాతనిదోర్బలశక్తిప్రాపునన్
మనుమనుజేంద్రుని న్మొనసి మార్కొన నోడుదు రన్యభూపతుల్. 546