విషయసంసక్తమతియగు వికలహృదయుఁ
డుఱక ప్రత్యర్థిక సుఖాభియోగ్యుఁ డగును. 532
ఆ. మఱియు విను మనేక మంత్రులచిత్తముల్
చంచలములు గన సచివు లెల్లఁ
గార్య మొదవినపుడు కడఁగి యుపేక్షించు
రతఁడు మును విరోధి యగుటఁ జేసి. 533
క. దేవబ్రాహ్మణనిందకుఁ
డేవెరవునఁ బొరయు ధర్మహీను డగుటన్
గేవలము దేవహతకుఁడు
భావింపఁగ నట్ల చెడు నభాగ్యుం డగుటన్. 534
ఆ. దైవ మఖిలమునకుఁ దానె కారణ మని
చేష్ట యతనిదైవచింత నుండు
క్షయము నొందుఁ దాన సమయు దుర్భిక్షవ్య
సని బలవ్యసనికి శక్తి లేదు. 535
క. వ్యాయామయోగ్యం బగు
నా యెడయ యదేశ మనుట నల్పుఁడు చెఱుచున్
వే యేల కచ్ఛపముచేఁ
దోయాంతరమున గజంబు తూలదె పెలుచన్. 536
క. బహుశత్రుఁ డెందు వచ్చిన
నహితులు వెనుదగిలి చెఱుతు రయ్యైచోట్లన్
బహుళమహావిపినాంతర
విహిత మగు కపోతమట్ల నిర్భరవృత్తిన్. 537
ఆ. సరి నకాలయుక్తసైన్యుఁ డాహవకాల
యుక్తసైన్యుచేత నుక్కడంగు
అర్ధరాత్రసమయమందుఁ గానఁగలేక
గూబచేతఁ గాకకులముఁబోలె. 538
గీ. సత్యధర్మవ్యపేతుతో సంధి యొప్ప
దతఁ డసాధుఁడ గావున నపుడ తిరుగు
నిట్ల సందేహనృపతుల నెఱిఁగి వారి
తోడి సంధానమున కొనఁగూడఁజనదు. 539
కామందకము
వ. మఱియు సందేహస్వరూపం బెట్టి దనిన. 540