పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 సాహిత్య మీమాంస

రసముచే చిత్తము నార్ద్ర మొనర్చి, ధర్మానురాగ ముదయింపజేయుటచే ఎట్టి పాపచిత్రమైనా చిత్తమునుండు తొలగి అంత:కరణమున ధర్మబల ముద్భవించును. అట్టి బలసంపద చేతనేకదా అబలారత్నమగు యాజ్ఞసేని గర్భశత్రువగు అశ్వత్థామను గాంచినతోడనే శోకతాప మార్పుకొనజాలెను.

సాహిత్యమున రసక్షేత్రములు -

వియోగాంత నాటకములగొప్ప భయానక కరుణా రసములం దున్నది; కాని పరిణామము రక్తపాత మయినచో బీభత్సరస ముత్పన్నమై పెచ్చుపెరిగి పైరెండు - రసముల నణగ ద్రొక్కి తానే రాజవుతుంది. రక్తపాతము చూచినా, విన్నా, తుదకు స్మరించినా కూడా బీభత్స ముదయించి గుండె తటతటలాడి, తనువెల్ల కంపించి చిత్తము క్షోభజెందును. ఆభావము రూపుమాసేదాకా దయాదాక్షిణ్యములు పొడచూప జాలవు. ఎవరిపైదయ? చంపబడినవానిపై సాధారణముగా దయపుట్టదు. ఒకడు మఱొక పాతఘాతకుని జంపినచో పురాతనమారకునియెడ జాలిపుట్టక నవీనుడే దయకు పాత్రుడగును. ఎట్లన, పినతండ్రిని హేమ్‌లెట్ పిల్కుమార్చెనే, ఇందెవరిపై దయ పుట్టును? నిస్సంశయముగా అందరూ చిన్న హేమ్‌లెట్ నే మెచ్చుకొందురు. మేక్‌బెత్ ప్రభువు మ్రందిన పిదప దయకు పాత్రుడవునా? కీచకదుశ్శాసనుల హత్యానంతరము వారియెడ అనుకంప జనించునా? ధార్మికులు నిగ్రహింపబడిననూ నిహతులయిననూ వారియెడ దయ పుట్టుట