పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20 సాహిత్య మీమాంస

మార్థికచింతచేతనే కదా మానవుడు ప్రపంచమును పెద్ద జేయును; అట్టి చింతచేతనేకదా శాంతివృష్టిని కల్పించి అమృతధారల ప్రవహింపజేయును. ఈలాలసేకదా మానవప్రకృతికి ప్రబల మగు నిధానము-దయ, దాక్షిణ్యము, ప్రేమ, స్నేహము, భక్తి మొదలగు వాటి కాటపట్టు మానవాంత: కరణమేకదా? దీనిని పరితృప్తి చేయుటయందే మానవు డెల్లప్పుడును వ్యగ్రుడై యుండును. అట్టివానికి నరకయాతనా ప్రదర్శన మెట్లు లాభకారి కాగలదు? పాపభీతి కల్గినంత మాత్రాన పుణ్యప్రవృత్తి అలవడునా? మానవులయందు ధర్మాసక్తి వెలయింపవద్దా? సద్వృత్తుల తృప్తిచేయు సాధన మేది? ధార్మికాదర్శముల సృష్టింపవద్దా? ఒకపుణ్యాత్ముని పవిత్రచరితమును పఠిస్తే అది మనమానసముల నాకర్షించును, తన్మూలమున పరమానందము కల్గును. ఇట్టి యానందము పాపచరితముల పఠించి తద్భీషణపరిణామములకు భయపడునప్పుడు కల్గునా? పుణ్యఖనులయొక్కయు మానధనులయొక్కయు ఉదారత, దానవీరుల మహత్వమున్నూ మన మానసముల నలరించి అంత:కరణముల యందు సత్స్ఫూర్తి పరిఢవిల్లజేయును. ఇట్టి కార్యసిద్ధి యింకొక తెరగున ఘటిల్లునా? పాపకంటకములు దూరమునకు తోసి పుణ్యబీజములు మానవమానసములయందు నాటుటకు పుణ్యాత్ముల సౌశీల్యమున్నూ ధార్మికుల ఆదర్శోన్నతీ చిత్రించుటే పరమసాధనము.