పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నగ్రథితములు. తదుపాదేయములగు ఆధ్యాత్మికభావములను సంగ్రహించి మన సూక్ష్మశరీరములను పోషించు కొందుము; కావున అట్టి గ్రంథములే సాహిత్యమగును.

ఏయే భావములు సంగ్రహించి ఉత్తమపథానువర్తులమై ఉన్నతపదవిని సాధింపగలమో, వేటి నవలంబించి పరమపురుషార్థదాయకమగు త్రోవను ముందంజ వేయగలమో, వేటిని పూనుకొనియుండుటవల్ల మనుష్యధర్మములు మన కలవడునో, అట్టి భావసంచయము మనచిత్తమున కానందమూ, నైర్మల్యమూ, చేకూర్చి క్రమముగా ఉత్కృష్టలాభము నొందజేయును. దీనికే సాహిత్య మనిపేరు. అట్టి సాహిత్యమే మన కిప్పు డావశ్యకము.

ఒక జాతి సాహిత్యముతో నింకొకజాతి సాహిత్యమున కెట్టి సంబంధము నుండదు. ఒకవేళ ఉన్నా అది నామమాత్రమే. ప్రతిజాతిజ్ఞానమును, ప్రతిసంఘభావభాండారమును భిన్నముగా నుండును. జాతినిబట్టి సాహిత్యము సంఘటిత మవును. ఒకజాతి నీచోన్నతుల నెఱుంగవలె నంటే దాని సాహిత్యము చదివితే తెలియును. ఈగతులకూ సాహిత్యమునకూ దృఢమైన సంబంధ ముండును. సాహిత్యగ్రంథముల యందు జాతియొక్క సుఖదు:ఖములు, ఉచ్చతావనతులు మంచిచెడ్డలూ స్పష్టముగా ప్రతిబింబితము లవును. మన జాతీయభావములు నశింపకుండా ఉండవలెనంటే మన జాతీయ సాహిత్యరక్షణ చేయవలయును. జాతీయజీవనమునకు జాతీయ సాహిత్యరక్షణ మత్యంతావశ్యకము.

_________