పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124 సాహిత్య మీమాంస

దానిని భరతుని అరచేతిలో బెట్టెను: కాని గద్దియ నాతడాక్రమింప నియ్యకొనెనా? లేదు, తల్లిముచ్చటలు ముక్కలుచేసినాడు. రామలక్ష్మణులకు వనవాస మబ్బినందునకదా సింహాసన మాతనికి జిక్కెను ! తండ్రిగారు తరలిరి, కుటుంబమంతయు శోకాబ్ధిని కూలియుండెను, అయోధ్యయందు హాహారవ ముదయించెను, సామ్రాజ్యమంతటా సంతస మస్తమించెను; అట్టివేళ నాతడు సింహాసన మధిష్ఠింప దలచునా ? పోనీ - ఆ సద్దణగిన వెన్కనైన గద్దియ నారోహింపనెంచునా? కల్ల. హృదయము నలమియున్న భ్రాతృభక్తి ప్రబుద్ధమగుటచేత నాతడు తల్లిని దూషించి సింహాసనలోభమును త్యజించెను. పిమ్మట తా నెన్ని విధముల అనునయ వినయములచే శ్రీరాము నయోధ్యకు గొంపోవలయునని యత్నించినా ఆతడు రాకుండుటచే ఆతనిపాదుకలు సింహాసనమున నుంచి వాటి నర్చించుచూ అనాసక్తుడగు కింకరునివలె రాజ్యపాలన మాచరించుచుండెను. ఆత్మసంయమబలముచే ఆతడు అయోధ్యాసింహాసనమునే కాదు అమరేంద్రు సింహాసనమునైనా అధిరోహించుటకు అర్హత సంపాదించెను. అఖిలభూతముల హృదయపీఠ మలంక