పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132 సాహిత్య మీమాంస

హిందూసాహిత్యమున చిత్రింపబడినది. నవోఢానురాగము రానురాను ప్రౌఢమై ముగ్ధను ప్రౌఢగా నొనర్చి గృహిణిని చేయును. సంసారమంతా గృహిణీప్రేమ పూరితము; ఆప్రేమ కుటుంబమంతటా వ్యాపించి, మరిది, అత్త, మామ, బావ, పుత్రుడు, పుత్రికలయందు సంక్రమించును. ఇట్టి చిత్రము లనేకములు ఆర్యసాహిత్యమున కలవు. కౌసల్య, గాంధారి, సుమిత్ర, కుంతి, సీత, ద్రౌపది మొదలగు పాత్రము లిట్టి చిత్రములే. వయసుమీరిన ఆర్యవనితలెల్ల సంసారమాయా మోహబద్ధులగుట కిదే హేతువు. వారిహృదయములు స్నేహసముద్రములు కావుననే కుటుంబమంతా వారికి వశమగును. గౌతమీ కౌసల్యల వాత్సల్య మిట్టిదే; వారి మాట నెవ్వరూ జవదాటరు.

ఆర్యసాహిత్యమున శృంగారము

ఈప్రేమను వర్ణించుటకు కాళీదాసప్రభృతి మహాకవులు శృంగారరసము నవతరింపజేసి దాని కనేక భావ భంగులు నిరూపించిరి. ఈవర్ణనలు చూపి చాలామంది ఆర్యసాహిత్యమున ఇంద్రియలోలత్వము వర్ణింపబడలేదా అని ప్రశ్నిస్తారు. అది లే దనము. చంద్రునియందు కళంకమువలె ఆవర్ణన లాసాహిత్యమునకు శోభాయమానములని యెరుగవలెను.

                 "మలినమపి హిమాంశోర్లక్ష్మ లక్ష్మీంతనోతి" కాళిదాసు
                 "చలువల రేనికిం జెలువొసంగు మలీమసమయ్యు నంకము."