పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

131 మానవప్రేమ

యవ్వనవంతు లగుదాకా వారికి వివాహము కాదు, సంసార ధర్మము లుండవు, స్వచ్ఛందులై వారు జీవములను గడుపుచుందురు. ఇంద్రియలాలస వారియందు ప్రబలముగా నున్నా దానికి తగిన వ్యవస్థ లేర్పడియుండవు, కుటుంబనియమము లుండవు. సాధారణులకు ధర్మము కానీ, కర్తవ్యజ్ఞానము కానీ లేవు, ఉండినా అవశ్యాచరణీయములు కాకుండుటచే ఆత్మనిగ్రహమున కనుకూలపడవు. అందుచే యౌవనప్రవాహమున కొట్టుకొనిపోతూ ఎవ రెక్కడ తేలుదురో టికానా లేదు. ఇంద్రియప్రాబల్యము నణచడము సులభసాధ్యము కాదు గాన సంసారనియమములు దృఢముకానిచోట్ల యువకులు స్వేచ్ఛాచరణు లగుట సంభవింపక తీరదు.

హిందూ కుటుంబప్రేమ వికాసము

ఆర్యప్రేమాదర్శమున దంపతీప్రేమ పరమశాంతమయ్యు వర్థిష్ణువై తరంగిత మగుచున్నది. అది పూర్వానురాగబలమున వృద్ధిచెందును. అల్పవయస్కులగు దంపతుల ప్రేమయందు పూర్వానురాగప్రవాహము అంతర్వాహినియై వెల్లివిరియ యత్నించునప్పుడు ఆప్రేమస్రోతాభాసమును గని పెద్ద లానందింతురు. అది బైట కెక్కడ ఉబుకునో అను భీతిచేత నవోఢ లెంతో కష్టమున దానిని దాచయత్నిస్తారు, కాని అణచినకొద్దీ అతిశయించి మెరుపుమెరసినట్లు అప్పుడప్పు డది తేటబడుచుండును. అది అప్రకాశ మగుటచేతనే అతి ప్రశాంతముగనూ ఈషన్మాత్రసంకేతరూపముననూ