పుట:SaakshiPartIII.djvu/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాశక్తినుండి యనేకములైన యంధప్రాయములగు శక్తులుద్బవించినవి. పంచభూతముల యొక్క మహోన్మత్తచర్యలు జగద్విదితములేకదా? కారణము లేకుండ నవి చెలరేగినవా యని యందువేమో? కారణములా? అబ్బ మొదట సృష్టికిఁ గారణమున్నదా? సృష్టించె నని మన మనుకొనుచున్న మహాశక్తికే కారణము కనబడనప్పడు నీవు గంగవెఱ్ఱులకు గారణము చెప్పఁబూనెద వెందులకు? ఇంక గార్యకారణసంబంధము నాయెదుటఁ జెప్ప కేమి. నీ మనస్సునకు సంతుష్టి కలిగినట్టు నీమొగము చెప్పచుండుటలేదు. బందరు గాలివానకు బరామీటర్లోని పాదరసశలాక యని atmosphere అని, density యని, Nature abhors vacuum అని చప్పని సారహీనమైన చచ్చుScience మాటలు నాతో జెప్ప బూనెదవా? నా మనస్సు పరబ్రహ్మ మని చెప్పఁబడు మహాశక్తివంక కెగురఁ జూచుచుండం బనికిమాలిన ప్రకృతిమాటలు పలికి దానిని దిగలాగెద వేమి? పూర్వోత్తర సందర్భశూన్య ముగ బుడబుడక్కుల ధోరణిని సత్యపురసాక్షిసంఘమునందుపన్యాసము లిచ్చుటకాదు. ఆలోచించి మరి మాటలాడుము.

కూలిముండకొడు కొక్కడు కునికిపాట్లు పడుచు నెర్రజెండా చూపుటకు బదులు పచ్చజెండా చూపినంతమాత్రమున ధూమశకటము పట్టాలనుండి జారి తిరుగఁబడుటా? వందలకొలది జనులు మహాఫెూర మరణము లొందుటూ? అద్బుతమైన, యనిర్వాచ్యమైన, యద్వితీయమైన మహాశక్తివలనఁ గలగినసృష్టి నొక్క రెప్పపాటుకాలములో ధ్వస్తమొనర్చుట కొక్కమనుజ కీటకాధమము సమర్ధమైనదా? అట్టనుటకంటెఁ బరిహాసాస్పదమైనపలుకు వేరొక్కటియున్నదా? చావవలసినవారు మహాకాలునిచేఁ జావనే చచ్చినారు. 'నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్" అని శ్రీకృష్ణుండు చెప్పలేదా?

భూకంపములచే నెన్ని వేలపట్టణములు దించుకొని పోలేదు! ఎన్నికోట్ల జీవములు సజీవసమాధుల నొందలేదు! వీరందఱ కైకకాలిక లోకాంతర ప్రాప్తియగుటకు వీరందఱ జన్మపత్రములలో మారకాధిపతి దశలే యానిముసమున సంభవించినవా? ధరామండలగ ర్బాంతరవాయు సంచలనమే దానికిఁ గారణ మని యంటినేని తత్సంచలనమునకుఁ గారణమేమి? సంచలనముమాట కేమి, మొదలు తత్తునకుఁ గారణమేమి? సన్యాసిమఠము దించుకొనిపోయినది. సానికొంప దించుకొని పోయినది. కల్లుదుకాణము దించుకొనిపోయి నది. కాళికేశ్వరియాలయము దించుకొనిపోయినది. గోమారకవిపణిశాలయుఁ గూలినది. గోరకకసంఘనిలయము కూలినది. ఇంతటితో నయినదా? పదివందల ధూమశకటముల గొట్టములలోనుండి వచ్చుపొగకంటె హెచ్చుగ బర్వతవదనగహ్వరమునుండి పొగ యుబ్బెత్తుగ బ్రబలవేగముతో నెగయుచున్నది. రోదసీ కుహర మంతయుఁ గ్రమ్ముచు న్నది. అకాలగాఢాంధకారభయంకర పరిస్థితిచేఁ బట్టపగలు కీచుకీచు మనుచు గీరుగారు మనుచుఁ బక్షులు రొద సేయుచున్నవి. ఆవు లంభా యని యార్పుచున్నవి. పందులు నెలుకలు గాడిదలు మొదలగునవి ఘర్షురించుచుఁ గిచకిచలాడుచు నోండ్రపెట్టుచు నటు నుండి యిటు నిటునుండి యటు నొడలు తెలియని యవస్థతోఁ బరుగు లిడుచున్నవి. బంధుడు లేదు మిత్రుఁడు లేదు తల్లి లేదు తండ్రి లేదు తమ్ముఁడు లేదు కొడుకు లేదు. ఎవరిమట్టునకువారు మహాభయోద్రిక్తహృదయములతో స్వప్రాణము లెట్టులయినఁ గాపాడు కొను నాత్రముతో నాచీఁకటిలోనే కనబడనియాదుర్దశలోనే యొక్కడికో యెఱుంగకుండఁ