పుట:SaakshiPartIII.djvu/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండునా? జోలి యావల బాఱవైచినాఁడు. కల్లుకొట్టులోఁ బ్రవేశించినాఁడు. త్రాగి యొడలు తెలియక యడ్డమైన బూతులు కనబడినవారి నెల్ల తిట్టినాఁడు. ఇట్టిభక్తికంటె నాస్తికత మంచిది కాదా? నాస్తికతలో నీతియున్నది. శాసనవిధేయత యున్నది. దీనిలో నవియైన లేవే.

కొందరు నరులు సుఖకాలమునందు దైవస్మరణ మొనర్చుచుందురు గడియగడియకు రామరామా యని యజచుచుందురు. కన్నబిడ్డలు గారుగీరు మనుచు గంతులువైచుచు నాడుకొనుచున్నంతవఱకు, గల్గా కొట్టులోఁ గృష్ణకాటుకలు సమృద్దిగ నున్నంతవఱకుఁ జేతిపెట్టెలో జార్జిసార్వభౌముని మొగములు చాలఁ గనఁబడుచున్నంత వఱకుఁ, గడుపుచల్లగ నున్నంతవఱకుఁ, బ్రక్కలో భార్య వెచ్చవెచ్చగ బండుకొన్నంత వఱకు, వీరి రామస్మరణ మింత యంత యుని చెప్పఁదగదు. దేవతార్చన లందు జయఘంటలు కావు-శుభనాదములు కావు-సాంబ్రాణి ధూపములు కావు-కప్పరపుటారతులు కావు -గోఘృతదీపములు కావు-చిత్రాన్నదధ్యోదనాదిభోగములు కావు-శ్రీపుష్చయోగములు కావు-ఓ చేతులబోడింపులు కావు; లెంపల వాయింపులు కావు-పైగడబడలు, దడబడలు, నెన్నియైన జరుపుదురు. ప్రతిరాత్రి పురాణకాలక్షేపము; పక్షమునకు సాలగ్రామదానము; మాసమునకు సత్యనారాయణవ్రతము-సంవత్సరమునకుఁ బెరుమాళ్లకు బిరాట్టికిఁ బున స్సంధానము. వీరు సుఖదినములలో దైవము పేరుపెట్టుకొని యెంత కోలాహలమైన నెంత హంగామా యైనఁ జేయుచున్నారు. సాయం కాలమగుసరికి యొడలు రవంత వెచ్చ బడినది. ఆరాత్రియే పురాణకాలక్షేపము మూల బడినది. తెల్లవాఱుసరి కమ్మగారికిఁ దొంబదియెనిమిదివఱ కుండవలసినదానికి నూటమూఁడున్నది. ఆయుదయమే పెరుమాళ్ల కష్టోత్తరశతనామార్చన సున్నయైనది. అయ్యగారి కుషఃకాలస్నానము లేదు సరేకదా, తొమ్మిదిగంట లైనను దంతధావనమైన లేదు. మొగము కడుగని యయ్యవారు సాలగ్రామములు కడుగునా? పిరాట్టిశిరమునకుఁ దిరుమంజనము మాని పెండ్గాము తల కమృతాంజనము రాయుచున్నాఁడు. మూల్గుచున్న భార్య వంకఁ జూడవలసిన యయ్యవారు నోరుమూసికొన్న పెరుమాళ్లవంకఁ జూచునా? పూజాకాలమందు సేవాకాలము చెప్పటకు రావలసిన భాగవతోత్తములు దిగులువడ్డ మొగములతో, శ్వాసకోశపరీక్షాయంత్రములతో, ముక్కద్దములతోఁ జేతిదుడ్డతో, జర్మపాదరక్షలతో మహమ్మదీయవైద్యుఁ డొకఁడు, మంగలివైద్యుఁ డొకఁడు, మాలవైద్యుఁ డొకఁడు లోనికిఁ బ్రవేశించి, యమ్మగారిని బరీక్షించుచున్నారు. శ్వాసకోశములలో రవంత గురుకున్న దని యొకఁ డనినాఁడు. ప్రేగులోఁ గాసంత గళు కున్నదని మఱియొకఁ డనినాఁడు. హృదయకోశములో రవంత 'మర్మ రున్న దని యింకొకఁ డన్నాఁడు. శ్లేష్మవాతజ్వర మని (Pneumonia) యొకఁ డనినాఁడు. ఆంత్రజ్వర మని (Typhoid fever) మఱియొకడన్నాడు. మన్నెపుజ్వర మని (Malaria) ఇంకొక డన్నాఁడు. ఏది సిద్దాంతమని యయ్యవా రడిగినాఁడు. విశిష్టాద్వైతమే సిద్ధాంతమన్నవా డీ మాలమంగలి వైద్యులను జ్వరసిద్దాంత మడిగినాఁడు. భార్య బ్రదుకదని యేడ్చు చున్నాడు. అపాయకర మని ముగ్గురుకూడఁ జెప్పినప్పడేమిచేయును? శ్లో. న ధర్మని ష్ఠోస్మి న చాత్మవేదీ, న భక్తిమాన్ త్వచ్చరణారవిందే । అకించనో నన్యగతిశ్శరణ్య, స్త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. యని బట్ట మెడఁ జట్టుకొని పెరుమాళ్లకు సాష్ట్రాంగ పడవలసిన యయ్యవారు నాభార్యను రక్షింపరా యనిమాలవైద్యుని కాళ్లపైఁ బడుచున్నాడు.