పుట:SaakshiPartIII.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పినను వినవలసినదే. అందులో జన్మతారకమైన భక్తినిగూర్చిన మాట లనుదినమున ననుక్షణమునఁగూడ వినవలయును. వినగా వినఁగాఁ గొన్నిమాటలైన మనస్సున స్థిరముగఁ బ్రవేశించునేమో, యవి యెన్నంటికైన నాచరణములోనికి వచ్చునేమో యని నేను దేవులాడుచున్నాను. ఒకసారి వచ్చినది తిరుగ రాఁగూడదనుట కిది యేమి స్పోటకమా? అదిగో యావైష్ణవులు మాటలోనే వచ్చుచున్నారు. నాయనలారా! ఉపన్యాసము వల దనకుఁడు.

అయ్యా తిరువేంగడాచార్యులుగారూ! దయచేయుడు. నాయనలారా! నే నిప్పడు మీతో మనవిచేసిన యాచార్యులవారు వీరే శ్రద్దతో వారిభక్తివిషయకోపన్యాసమును వినవలయును.

వైష్ణవుని యుపన్యాసము

శ్రీమతేరామానుజాయ నమః సోదరులారా-అడియేనికి రవ్వంత సంస్కృతసాహిత్య మున్నది. వైష్ణవమతగ్రంథములను గొలఁదిగా నడియేను సేవించినాండు. ఈసభలో ననేకులు తఱచుగ వచ్చి యుపన్యసించుచుండంగా నడియేను కాభాగ్య మేల లేకపోవలయును నని యిచ్చట కిందులకు సిద్దపడినాఁడు. ఐహికవిషయములపై నేమి చెప్పిన నేమి వినియోగమని యెంచి, భక్తినిగూర్చి చెప్పఁ దలంచితిని-అచ్చటచ్చట గొన్ని ప్రపత్తిమాటలుగూడ రావచ్చును.

భక్తి యనంగా నేమి? తైలధారావదవిచ్చిన్నస్మృతిసంతాన రూపాపన్నజ్ఞానము భక్తి యని పెద్దలు సాయించినారు. తైలధారవలె సంతతము నిరంతరముగ భక్తియుండవలయును. ఎక్కడను దెంపుగాని, వంపుగాని, తరుఁగుగాని, విరుఁగుగాని యుండఁగూడదు. ఎందఱెందఱకెన్ని యెన్నిరోగములు వచ్చినసరే, యెన్నియెన్ని వ్యవహారము లెట్టు ధ్వస్తమైన సరే, యెన్నెన్ని పరాభవములు, ప్రజానిందలు సిద్దించిన సరే, భక్తిసాంతత్యమునకు భక్తినైరంతర్య మునకు, భక్తిప్రవాహవేగమునకు భంగము లేశమైన రాఁగూడదు. తీయనీటికిఁ జేఁప యెక్కినట్లు, భక్తి మనస్సునం దట్టె యట్టె ప్రవేశించి, మనస్సులోని యైహిక సంకల్పము లన్నియు నావల ద్రోచి, తాను మాత్రమే భగవత్ర్పేమరూపముగా నిల్చియుండవలయును.

కొందఱకుఁ గష్టములు సంభవించినప్పడు తాత్కాలికము భక్తి కలిగిన ట్లుండును. కాలికి ముల్లు గ్రుచ్చుకొన్నప్పడు మనుజుఁ డమ్మాయని యబుద్దిపూర్వకముగ నను చున్నాఁడు. అమ్మను నిశ్చయముగా మనస్సునందుఁ దలంచి యమ్మపైనుండు ప్రీతిచే, భక్తిచే నాతడట్లామ్మాయని యఱచినాఁడా? అమ్మ వచ్చి రక్షించు ననువిశ్వాసముతో నామెను బిలిచెనా? అట్టి యాక్రోశములకు మనస్సుతో సంబంధము లేదు. అవి కొంచెము హెచ్చుతగ్గుగ దైహికవికారములు కాని మఱియొకటి కావు. "నారాయణా! వారాయణా! భగవన్నారాయణా! నారాయణా" యని పాడుచు ముష్టిదాసరయ్య వచ్చును. ఆతని నారాయణస్మరణము మనఃపరిపాకముచేఁ గలిగినదా? కడుపుమంటచేఁ గలిగినది. ఆఁకలిచే నది కలిగినది కాని యంతశ్శుద్దిచేఁ గలిగినదా? అలవాటుచే నది కలిగినది కాని యాముష్మికార్తిచేఁ గలిగినదా? జోలి నిండఁగనే నారాయణస్మరణము రవంతయుఁ గట్టుపడును. అటుపైని దా నెవడో నారాయణుఁ డెవండో దాక నిండుకైవచ్చిన నారాయణస్మరణమునఁ దత్త్వము