పుట:SaakshiPartIII.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరాగ్రేసరునివలె బాయకత్తి జళిపించి ఝాంకరించి, సంహరింపఁ బోవుచు నొకపు డిట్లే యందఱాడవలసిన యాటలు తానే యాడి తానే పరవ్యక్తులైనట్టు మాటలాడు సవ్యక్తిసంఛన్న పూర్వకపరవ్యక్తిప్రవేశ పాండితీమండితుండగు నాతఁడు కవి.

ఆంతరప్రపంచములోని రూపశూన్యములైన రసభేదములు, నవస్థాభేదములు నక్షిగోచరములు కాకుంటచే వానిని వివరించి, విస్పష్టముగా మనయెదుటఁ బెట్టవలసివచ్చుచున్నపుడు బాహ్య ప్రపంచమున మన కనుభవములో నున్నవస్తువులను జట్టుభట్టు సందర్భానుసా రముగ నుపమలొనర్చి తెలియనివానినిఁ దెలియున ట్లొనర్చి చీఁకటిపై వెలుతురినిఁ బ్రసరింపఁజేయు విజ్ఞానతేజశ్శాలియగునాతఁడు కవి. మనస్సంకల్పములు, చిత్తవికార ములు, బుద్దిభ్రమములు, వివిధరసస్పురణములు, వర్ణ్యవిషయములైనప్ప డాయగోచరపరిస్థితులను దెలియఁబఱచుటకు బాహ్యప్రపంచమునందలి సౌమ్యపరిస్థితులసాహాయ్య మావశ్యకము, ఆంతరప్రపంచమందలి సౌమ్యపరిస్థితులసాహాయ్య మావశ్యకము, ఆంతరప్రపంచము నందలి యజ్ఞవిషయమునెల్ల సూక్ష్మముగా, సునాయాసముగా, సుప్రశస్తముగా, నత్యంతసముచితములైన యుపమలతో లంకెవేసి మనసుతోనైన స్పష్టముగ గ్రహించుట కవకోశము లేనివానినిఁ గంటితోఁ జూచునట్టు చేయు ప్రకృతిజ్ఞానపరిపూర్ణుఁ డైనయాతండు కవి. కవి ప్రాశస్త్యము సముచితోపమాన సంఖ్యను బట్టిగ్రహింపవచ్చును. శ్రీమద్రామాయణము నందు వాల్మీకి యుపయోగించిన యుపమలకు హద్దు లేదు. తులసీదాసుని రామాయణమునందుఁ గూడ నట్లే యున్నవి. మనఃప్రపంచమునందలి యవస్థాకోటులకెల్ల బాహ్యప్రపంచమున నుపమానకోటులున్నవి. కవి వానిని గ్రహింపవలయును. అది యిదియు నొకటే, అది యిదియు నొకటే యనుటకు సామ్యముకొఱకు గవి యెట్టు ప్రకృతినిఁ బరిశీలించునో, యది యిది కాదు, అది యది కాదు, (నేతి, నేతి) యని పలుకుటకు వేదాంతియు నట్లే ప్రకృతినిఁ బరిశీలించును. సామ్యపరిజ్ఞాని కవి. భేదపరిజ్ఞాని వేదాంతి. సామ్యముఁ తెలియకపో వుటకు నిజమే. కాని కవి యందు సామ్యజ్ఞానము విశేషముగ నుండును. వేదాంతి యందు విభేదజ్ఞానము విశేషముగ నుండును. ఇది స్థూలమైన నిర్వచన మని యెఱుఁగవలయును. అపదార్థములైన యంతరంగావస్థలకుఁ బదార్థత్వమిచ్చి ప్రత్యక్షము చేయుట కుపమాలంకా రము మహాకవులందఱు మిక్కిలి విరివిగా వాడియున్నారని చెప్పియున్నాను. బాహ్య పరిస్థితులను వెల్లడించునప్పడు గూడఁ గవు లుపమలను వాడినారు, వాడుచున్నారు. వాడఁగలరు. ఇది కేవల మావశ్యకము కాదు కాని యలంకారమునకు, జమత్కారమునకు, సౌందర్యమునకు, వస్తువైశద్యమునకుఁ గవు లట్టు చేయుదురు. మఱియుఁ గవులు మఱి యొక విధములయిన యుపమలను గూడ వాడుచున్నారు. అవి యేవనగ బాహ్యావస్థలను వెల్లడించు నప్ప డాంతరావస్థల నుపములుగఁదీసికొనుచున్నారు. ఇది కేవలము విరుద్దము. రవంత దెలిసినదానిని దెలుపఁగోరి తెలియని దానినిగాఁ జేయుచున్నారు. ఇట్టిక్లిష్ట పరిస్థితుల కుదాహరణములు గొన్ని యిచ్చెదను. మహాకవిశిఖామణియైన వాల్మీకినుండియే యిచ్చె దను. అశోకవనమందుండిన సీతాదేవిని వర్ణించునప్పడు శుక్లపక్షాదియందలి చంద్ర రేఖవలె నున్నదని చెప్పినారు. ఇది తెలిసినది. 'పినద్దాం ధూమాజాలేన శిఖామివ విభావసో’ అని మఱియుఁ జెప్పినారు. ఇదికూడ దెలిసినది. కాని "స్మృతీమివ సుసందిగ్జాం కీర్తిం నిపతితా మివ, నిహతామివ ఛ శ్రద్ధా మాశాం ప్రతిహతామివ. బుద్దిం సకలుషామివ’ యని యనేకము లయిన యంతరావస్థల నుపములుగా జేసినారు. సందిగ్ధమైన స్మృతివలె, నిపతితమైన కీర్తివలె, నిహతమైన శ్రద్దవలె, ప్రతిహతమైన యాశవలెఁ, గలుషమైనబుద్దివలె సీతాదేవి యున్నదని జెప్పటవలన సీతను గూర్చి తెలియకపోవుటయే కాక తెలియని యవస్థానభేదము లెన్నియో