పుట:SaakshiPartIII.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రయత్నించినారు. దేవతానివేదితాన్నమే కాని తినఁగూడ దనంగ నర్థమేమి? తిన్న యాహారమంతయు దేవసేవకొఱకే యని యన్నముతోఁ బ్రమాణముచేయుటయే కాదా?

అందుచే మతకర్తల సంబంధముచే, మహావీరుల సంబంధముచే, దేవతల సంబంధముచే, దేవతల సంబంధముచే, నవతారపురుషులసంబంధముచేఁ బవిత్రములగు దినము లందు మన ధర్మసంస్థల యుత్సవము లన్నియు జరిగించుకొనుట సర్వవిధముల శ్రేయము. ఆదినముల కధిష్టాతలగు మహాపురుషులుకూడ, మహాత్ములుకూడ, దేవతలుకూడ, మనతో పాటు సభలలోఁ గూరుచుందురు; మనకు మంచియూహలఁ గలిగింతురు; మనకు సత్కార్యదీక్షను బుట్టింతురు; వారివారి యాత్మలలోని విద్యుచ్చక్తిని మనము సహింపఁదగి నంతవఱకు మనకుఁ బ్రసాదింతురు; మనకు సర్వకార్యసాఫల్యమును జేయుదురు; మనసంస్థలు శాశ్వతముగ వర్ధిల్లవలయునని యాశీర్వదింతురు; దేవతలస్మరింపకుండ మనమేదియు సంకల్పించుకొనఁదగదు. దేవతల నాహ్వానించి యారాధింపకుండ మన మే ప్రయత్నముఁజేయఁదగదు. వినాయకదేవు నిచ్చట బ్రతిష్ఠించి, పత్రపల్లవప్రసవాదులచేఁ బూజించి, ఫలమోదకాదిభక్యములు నివేదించి, భక్తితోఁ బాదములకుఁ బ్రణమిల్లి, యేతత్పాదపద్మ సన్నిధానమున సాక్షి సంఘపునర్నిర్మాణ మొనర్చుటచేత, సాక్షిసభలో నిప్పడు వేంచేసియున్నావా రెవరో యెఱుఁగుదురా?

నాయనలారా! సంసారచింతల కొక్క క్షణము శాంతిఁ జెప్పి, కప్పదాటులు వేయుము నస్సును గట్టిగఁబట్టి, శ్రద్ధావంతులై యీశ్వర ధ్యానతత్పరులై రవంతసే వుండఁగలరా? అదిగో, ఏమి కానవచ్చుచున్నదో? నిశ్చలదీక్షతో, నిర్మలమనస్సుతో నీరంధ్రదృష్టితోఁ జూచెదరా! ఆహా! చీమకుత్తుకలో సింహము ప్రవేశించినదే! సముద్రసప్తకము చౌటిపడియలో నిఱికినదే! పరమాణువులలోఁ బర్వతమిమిడినదే! కాసులేనివానిగుడిసెలోఁగైలాసమవతరించినదే! ఆహా! చూచితిరా! రజతాద్రియెట్లు వెలిఁగిపోవుచున్నదో ఉదయమార్తాండుని కిరణజాలమాకొండపై బ్రసరింపఁగఁగొండ యేమియఖండతేజోమండితమై ప్రకాశించుచున్నది! కుడిప్రక్కను గాంచితిరా? లక్షలు, కోటు లగునింద్రధనస్సులు పడుగు పేకగా నల్లుకొనిపోయి చిత్రవిచిత్రాతి విచిత్రమహా విచిత్రవర్ధములను వర్షించుచున్నవికదా! ఆతేజస్సంఘాత మొకప్పడుపాము మెలికలుగఁ బ్రవహించుచున్నది, చూచితిరా! ఇప్పడు తరంఘ ఫక్కిగ ఠవణించుచున్నది. ఇప్పడదిగో జలయంత్రములోని నీటిసోనవలె బైకెగసి రంగురంగులపూవుల నీనుచున్నది. అదిగో, ఇంతలో సుడిగుండములో వలె గిరగిరఁ దిరిగి క్రిందికిఁ గ్రుంకిపోవుచున్నది. కన్నులు చెదరుచున్నవి. ఒక్కనిముసము కన్నులుమూసికొనుట మంచిది. ‘శంకర భగవానుఁడా! కన్నులు చెదరిపోకుండఁ గటాక్షింపుము. తలతిరుగ కుండునట్టు దయసేయుము. త్వదీయవైభవమును జూచి తరింతుము. తండ్రీ! తండ్రీ! ఓహో! అనిర్వర్ణ్యమైన యాయద్భుత తేజమునుండి యంతకంటె ననిర్వర్ణ్యమైన యొకతేజో రాశి బయలువెడలుచున్నదే ఆతేజోరాశి యొకత్రుటిలోఁ గుడివైపు శుద్దస్పటికసహస్ర కాంతితో, నెడమప్రక్క నింద్రనీలకోటికాంతితో, రెండుపాయలుగా విడిపోయియుఁగలసియే యున్నదే వారే పురాణదంపతులగు పార్వతీపరమేశ్వరులు! ధన్యోస్మి! ధన్యోస్మి! శంకరా! అఘనాశంకరా! దుర్గా సంరక్షితభక్తవర్గా! నమస్కారములు. నమస్కారసహస్రములు. నమ స్కారకోటులు.

ఓమ్ శాంతి శ్శాంతిః.