ప్రయోగవిజ్ఞానం, బలవదపి శిక్షితానా మాత్మన్యప్రత్యయం చేతః" అని వ్రాసినాఁడు. ఇది యెంతలౌకికపు వ్రాతయో చూచితిరా? తన్నుఁ దూలనాడుచున్న వారిని విద్వాంసులని శ్లాఘించు చున్నాఁడు. వారి శిరఃకంపనమే తనకుఁ గావలసిన దనుచున్నాడు. అది లేనియెడల దన గ్రంథమసాధు వనుచున్నాడు. ఆహా! ఇవి యెంతగడుసుమాటలు! తిట్టువారి నోటికింత కంటె గట్టిమంత్రమేమున్నది? తిట్టు స్తోత్రమువలననే యడంగును గాని తిట్టవలనఁ బోవునా? ఈమాత్రపు బ్రకృతి రహస్యమును గ్రహింపలేక భవభూతి తెగిపడి తిట్ట నారంభించినాఁడు. ఉత్తమ కవుల ప్రాశస్త్యమును సమకాలికులే కాదు. కొంచెము తరువాతి వారు గూడ గ్రహింపలేరు. షేక్సుపియరు యొక్క మహాప్రజ్ఞనాకాలములో గ్రహించినవా రేరి? బ్యాక వంటివాని కనులకే యీమహాకవి కళాకౌశలము కనబడలేదే! ఆతని తరువా తివారగు జాన్సన్ మొదలగువా రీకవికి లేనిదోషములను గల్పించి తూలనాడిరి. జాన్సన్ కంటికి, నాంగ్లేయసారస్వతతిమింగల మని పేరొందిన వానికంటికి పోపు అనువాఁ డెక్కువ కవిగాఁ గనబడినప్పడిక జెప్పవలసి దేమున్నది?
పాపము. భవభూతి యిష్లే ప్రజలతిట్టవలన బాధపడినాఁడు. ఏమి చేయ వచ్చును? కవితా ప్రారబ్దమున్న ప్రతినిర్భాగ్యున కీబాధ తప్పదు. కొందఱు కవులు విని విననట్టం దురు. కొందఱు కవువు వినకుండ నెన్ని ప్రయత్నములైన జేసికొందురు. కొందఱు విని ముసిముసినవ్వులు నవ్వి యూరకుందురు. కాని లోకబాధ పడనివాఁ డొక్కడును లేఁడు. ప్రజలను దిరుగఁబడి నోటికసిదీఱ తిట్టుట కవకాశమునకై కొందఱు వేచియుందురు. అట్టి యవకాశము రాకపోయినను గల్పించు కొందురు. భవభూతి ఉత్తర రామచరిత్ర నాందీప్రస్తావ నలో విమర్శకులఁ దిట్టుట కట్టవకాశమును బుద్దిపూర్వకముగఁ గల్పించుకొనినాఁడు. ఎట్లో వినుడు. నటసూత్రధార సంభాషణములలోనిభాగ మిప్పడు మీకు విన్పింతును వినుడు. బ్రహ్మశ్రీ జయింతి రామయ్యపంతులుగారి యాంద్రీకరణ మనుసరింతము.
సూత్ర:- మన కిదియంతము నేల? నిజకులమర్యాదానుసారముగ రాజద్వారమునే సేవింతము రమ్ము.
నటు:– అట్టయిన, రాజుగారియొద్ద బఠించుటకై నిర్దుష్టమైన స్తోత్ర మొకటి రచింపుము.
అంతటితో రవంత యాగుదుము. రాజద్వారమును సేవించుట నిజకులమర్యాదాను సార మైనప్పడు నిజకులమర్యాదాను సారముగ నటుడు రాజుగారియొద్ద మామూలుగాఁ బఠించుచున్న స్తోత్రములను బఠింపవలయునే గాని యారాత్రి నటునకు ప్రత్యేకముగ నిర్దుష్టమైన స్తోత్ర మెందులకు? ఒకవేళ ప్రతిదినమును నూతన స్తోత్రమును జరుపవలయు నన్న నిర్బంధము నటునకున్నదా? ఉండదు. కాని యున్నదే యనుకొనుఁడు. ఉన్నప్ప డందులకై నటుడు మహారాజకవిని గోరవలయును కాని నాటక పాఠములను చెప్పసూత్రధా రుని వేఁడనేల? సూత్రధారుడు మాత్రము కవి కాంగూడదా? ఎక్కడను వినలేదు. సరే. కవి యని యంగీకరింతము. అందుపైన సూత్రధారుఁ డేమనియెనో విందురా.
సూత్ర:- శ్లో. సర్వధా వ్యవహర్తవ్యం కుతో హ్యవచనీయతా యథావాచాం తథా స్త్రీణాం సాధుత్వే దుర్జనోజనాః