పుట:SaakshiPartIII.djvu/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొకమంగలి తల్లిదండ్రులతో రామేశ్వరమునకు పోవుచుండఁగాఁ బురుహూతికా పీఠసమీప మున నాతని తలిదండ్రులిద్దఱు మరణించిరి. వారిపై నొక్క నదిని భగీరథునివలె (భగీ రథుడు మంగలి కాదుగదా యని సభలో గేక) ఆసంగతి వలదు-ప్రవహింపఁజేయ నెంచి పీఠమునొద్దు గూరుచుండి తపస్సుచేసి గంగను దెప్పించెను. ఏలయ్య తపస్సువలన వచ్చిన గంగ కావున నేలేరని దానికిఁ బేరు కలిగెను. అంతట నాతం డేలేశ్వర మను నొకగ్రామమును స్థాపించి రామేశ్వరము నకుఁ బోవుదారిలోఁ గృష్ణానదీసమీపమునఁ దపస్సు చేసికొను చుండఁగా “నీ విచ్చట నుండవలయు నని" స్వప్నమున నొకదేవత చెప్పిన ట్లయ్యెను. అప్పడాతం డేలూరు స్థాపించి యిక్కడనే పరమపదించెను. ఏలూరిలోఁ బుట్టిన మంగళ్లుమాతమే యేలయ్య సంబంధమువలనఁ బరిశుద్దులైన మంగళ్లు. నిజమైన మంగ భేలూరివారే. బెజవాడ మంగళ్లని, రాజమండ్రి మంగళ్లని పెద్దపేరేకాని వారి జన్మములలోఁ గొంతకలితి కక్కుఱితి కల వని నేను దృఢముగా.

'నీ సిగగొఱుగ! నీగొంతుగోయ! మేము సంకరజాతివారమా! చూచెదరేమి' యని రౌద్రాకారులై పదిమంది మంగళ్లుపన్యాస రంగమునొద్దకు వచ్చిరి. నేను వారిని శాంతిపఱచి 'నీవు కూరుచుండుము. ఇంక మాటలాడవల"దని యావక్తను శాసించితిని.

తరువాత నొక్కడు పీఠ మెక్కి యిట్టనియెను. సోదరులారా! మనవృత్తి విశేషములు నేను గొన్ని చెప్పదును. వక్తను గాని హేతువుచే నుపన్యాసమును వ్రాసికొని వచ్చితిని. శిశువు గలిగినప్పడు బొడ్డుకోయుటకు మనకత్తి యవసరము. ఉపనయన సమయమున మనకత్తి యవసరము. మంగళసూత్ర ధారణ సమయమున మనకత్తి యవసరము. నిత్యకృత్యములందు మనకత్తి యవసరము. మగవాడు చచ్చినప్పడాతని భార్యశిరోజములను దీయువేళ మనకత్తి యవసరము. అట్టియాచారము లేనిచోటనైనను మంగళసూత్రము ద్రౌంపువేళ మనకత్తి యవసరము. పుట్టినది మొదలు చచ్చినపర్యంతము మంగలితోఁ బనియున్నది. పరిపాటిగల దలగొరిగించుకొను వితంతువులనొద్ద మంగలి యెంతదగ్గఱగాఁ గూర్చుండునో యెఱు గమా? సర్వస్త్రీలయందు మాతృభావము మన పవిత్రమైన వృత్తియే మనకు నేర్పుచున్నది. ఇంత పుణ్యవంతమైన వృత్తి మాత్రము ప్రపంచమున నింకొకటి లేదు. వీరాధివీరులగు రాజాధిరాజులను గూడ మంగలి తనముందు గదలకుండ మెదలకుండ గూరుచుండఁ బెట్టు కొనునే, జట్టు చేతఁ బట్టి కొనినను వారు నోరెత్తుటకు వీలులేదే! ఓహో ఎంత మతగౌరవ ప్రపత్తులుగల వృత్తియో చెప్పవలయునా? ఈవృత్తి ఘనత పూజ్యత చెప్పటుకు నాల్కకు శక్తి చాలదు. తలఁచుటకు మనస్సునకు శక్తిచాలదు.

మనకు వృత్తి క్షౌరవముకాని గానముకాదు. సన్నాయిపాటు బలిజీలు దూదేకులసాహే బులు మొదలగువారు నేర్చుకొనుచున్నారు. గానము క్రౌరమునకు రవంత సహాయకార్య ముగ మనలోగొంద ఆంగీకరించినారు. “మనపూర్వపుఁగొయ్యపిడి చేంతకత్తులకాల మునాఁటి శౌరపుసాగ సీనాఁడు లేదు. ఈనాడు కత్తిగుల్లయె పనికూడ నట్లే గుల్లసొగసు నునుపు, డాబేకాని పనివానితనపు పనందు లేదు. గుల్లకత్తితోఁ గూటివచ్చునా? చేఁతకత్తి కది చెప్పిన నుగుణము. ఈచేత కత్తితోఁ జేసిన గడ్డము ప్రబంధకవిత్వమువలెఁ బ్రశస్తగాన మువలెఁ బ్రజ్ఞాప్రకటకమై ప్రకాశించును. చిత్ర లేఖనమువలె, గానమువలె క్షురకర్మ యొక కళయే గాని శాస్త్రము కాదు. కవి యెట్టు పుట్టవలయునో, క్షురకు డట్లే పుట్టవలయును.