Jump to content

పుట:SaakshiPartIII.djvu/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెక్కువగ నధీనుఁడై దాని విసరుచే నెగురుచు నేను విలాసముగా విహరించు చున్నానని తన ప్రయత్నమును గొనియాడు కొనుచున్నాఁడు. దాని మరియొక విసరుచేనుత్తరక్షణమున సముద్రతరంగమునఁ బడి చచ్చితి నయ్యో దైవశక్తి నాప్రయత్నమునకుఁ దోడుపడలే దని యేడ్చుచున్నాఁడు.

అద్వితీయమైన యాశక్తిలో ననేకశక్తులు లీనమైయున్నవి. ఒక్కటి పుట్టించుశక్తి యొకటి వృద్దిశక్తి యొకటి కయశక్తి యొకటి వికాసశక్తి యొకటి సంకోచశక్తి యొకటి బహుమానశక్తి యొకటి శిక్షణశక్తి ఒకటి యానందశక్తి యొకటి దుఃఖశక్తి ఇట్లే యనేక కోటుల శక్తులున్నవి. ఇవి యన్నియు వేరుకావు. పరాత్పరుని శక్తి యిన్ని విధములుగా నగుచున్నది. ఆశక్తి కధీనుఁడై సముద్రముమీఁది నురుగువలె, గాలిలోఁ బరమాణువువలె బానిసయై కొట్టుకొనిపోవు మనుజుడు Chance చేత ననుకూలశక్తి విసరులోఁ బడినయెడల గనప్రయోజకత్వమని యెగురుచున్నాడు. ఆ Chance చేతనే యననుకూల శక్తివిసరులోఁ బడినయెడలఁ బ్రారబ్దమని యేడ్చుచున్నాడు. ప్రారబ్దము కాదు. ప్రయోజకత్వము కాదు. మనుజుఁ డస్వతంత్రుడు. అప్రయోజకుడు. మహాశక్తి కధీనుఁడై పోవువాఁడే కాని వేఱు కాదు కాదు.

గీ. కుక్కగొడుగులవలె బుట్టి క్రుంగు మనము
ప్రాక్తనప్రకృతిగతి ప్రవాహ మడ్డు
పఱతుమే? బుద్బుదములట్టు? పైన నూఁగి
యెటనొ టప్పన కుండ బ్రేలుటయె కాక.

గీ. వస్తు యాధార్ద్య మెఱుఁగక వస్తువునకు
నేదొ సంజ్ఞను మనముంచి యెరిఁగినట
లల్లాడుదు మిది యంత యైంద్రజాల
మందు దుముకులాడెడుబొమ్మలాట కాదె?

గీ. స్వప్నమునకంటె స్వప్నమై సత్యముగను
మాయకును మాయ యగుచు నమ్మకము గాంగ
శూన్యములకంటె శూన్యమై సుస్థిరముగఁ
గనఁబడెడు దీని నే మని యనఁగవచ్చు?

అంతయు నంధకారము. ఆ యంధకారములో నింద్రజాలము, అందులో నిద్ర, ఆనిద్రలో స్వప్నము. ఆస్వప్నములో బుద్దిమంతులమనుకొనిచేయునస్వభావప్రయత్నము లచేతఁ గలిగిన Somnambulism (నిద్రలో తిరుగాడుట) ఇట్టి మహాదురవస్థలో నుపన్యా సము లిచ్చు చున్నాము. గ్రంథముల వ్రాయుచున్నాము. అందుచేతనే యవి యన్నియు నొక్క వస్తువునుగూర్చి యైన యథార్డజ్ఞానము నీయకుండ నున్నవి. అన్నియుఁ బరశురామ ప్రీతి కర్దములు. వేసవికాల మైననేమి? వేయ వోయి చలిమంట వేయవోయి! ఇదియే పరమార్ధము. దీని మీదనే మనవారు సగుణతంత్ర మంతయుఁ గట్టినారు. అది యంతయు పట్టి మిథ్య. ఇదియే పరమార్ధము. దీనిఁగూర్చియే చిరకాల మాలోచింపఁగ నాకు మతిపోయిన