పుట:SaakshiPartIII.djvu/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది దైవికము కానియెడలఁ బిడుగు పాటునకై ప్రయత్నించినవాఁ డెవఁడు? మేఘుడైన ప్రయత్నించె నని చెప్పఁగలవా? పోనీ-ఆవీథి నాముసలిది యాసమయమున బుద్దిపూర్వక ముగా నడచుటచేత దాని చావునకు నారీతిగఁ దానే ప్రయత్నించెనని చెప్పఁగలవా? దైవికము లున్నవని యొప్పకొందువా, లేదా? ఇట్టివే కొన్ని తుపాను, భూకంపము, వహ్నిపర్వతసం క్షోభము మొదలగునవి యున్న వని యొప్పకొనవలయు నని గొణుఁగుకొనుచున్నావా? నీబుద్ది కందని విషయములలో నీశక్తికి మించిన సన్నివేశములలో నత్యద్బుతములై, యనిర్వాచ్యములై యగ్రాహ్యము లగువిషయములతో మాత్రము ముక్కుచు, మూల్గుచు దైవిక మని యొప్పకొని నీచచ్పుచచ్చున్నర కుంటి; గ్రుడ్డి, మూఁగ బుద్దికందిన వంట పెంట గుడ్డగుడుసు వ్యాపారములలో-ఓ చెలరేగి, నాప్రయత్నము పదునాల్గు పాళ్లకు రవంత దైవము తోడుపడునెడల నఖిలైహికకార్యములు నేను చేయఁగల నని వీథులవెంట నోండ్రపెట్టుచు పరగడలు ద్రౌక్కుచుంటివా? నీవింత దైవశక్తి ద్రోహి వగునందులకు నీనాలుక గోయింపవలదా? పోనీ-సాంసారికకృత్యములలో నైన నీ వనునట్టు నీ ప్రయత్నమునకుఁ గృతార్థత కలుగుచున్నదా? నీకళ్యాణమునకు నీవే కన్యాన్వేషణ మొనర్చితివే -జ్యాతిషికపండితుడవైన నీవే జాతకపరీక జేసితివే-నీవేకన్యాపూర్వ సంప్రదాయముల నెల్ల దడవితివే-అది మహాపతివ్రతయగు నని దానిఁ బెండ్లాడితివే- అది చపలయై చెలరేగి, జారులవెంట స్వారిపోవుచున్నదికదా. నీవు పురుషప్రయత్నముచే దాని నాంపఁగలిగితివా? పాపము. నీపదునాల్గుపాళ్ల పురుషప్రయత్నమునకు దైవము రెండుపాళ్లతోఁ దోడుపడకపోవు టచేత నిట్టయిన దని లోలోన నేడ్చుచున్నావా? ఆలాగా? నీభార్య సైయాటలాడుట పరపురుషులకే కాక పరదైవమునకుఁ గూడ నిష్టమే యని యభిప్రాయ పడుచున్నావా? దైవమే యూమెను తప్పుతిరుగుడులలో ద్రిప్పచున్నాడనికూడ నమ్ముచుంటివా? అటులైన నింక నాలస్య మేల? పట్టు-మట్టిగిడిసలవంటి పదునల్వురుముండలను సంపాదించు బారుకొ ట్టులు గట్టి వారి నందు విడియింపుము. నల్గురు తార్పుడుకాండ్రను నియమించు. ఈధనమహా క్షామదినములలో నేడు రూపాయల జీతముపై బి.ఎ. గాడు వచ్చును కాని -యూరూర చాటింపించు పత్రికలలోఁ బ్రకటించు సోదరీ మానవిక్రయమ హనీయుఁడవై కోటీశ్వరుఁడవైమానవజాతికంతకు మేటి కిరీటమువలె

చీ! ఆఁగు అంతటితో నాఁగు. నీవాదవైఖరి నాకేమియు బోధ కాలేదు. అంతయు దైవమే యందువా? అటులైనఁ బుణ్య మేమి? పాప మేమి? స్వర్గమేమి? నరక మేమి? బుద్దిస్వాతంత్ర్యమేమి? నడవడి సూటియేమి? జాతీయన్యాయమేమి? మనుష్య విధి యేమి? నాపిండ కూడేమి? నల్లమడు గేమి? బుద్దిహీనుఁడనై నీయొద్దకు వచ్చితిని. నేను బోదును అని నే నంటని.

ఉండవోయి Nonsense ఆగవోయి! Idiot! నీవు బుద్దిహీనుఁడవను మాట సత్యము. నీవే కాదు నీతోడి ప్రజ లందరు బుద్దిహీనులు-బుద్దిహీనుల రగు మీరు బుద్దిమంతు లని బ్రాంతిపడుటచేత మలకింత బుద్దిహీనులు. పశుపక్షి కీటకాదులైన యితర ప్రాణులు మీయంత బుద్దిహీనములు కావు. మీరు చెట్టకంటె బుద్దిహీనులు. చెట్లెదుగుచున్నవా లేదా? ఏ ప్రయత్నముచేసి యెదుగుచున్నవి? ఇంతకు మఱ్ఱిగింజ యెంతో మఱ్ఱిచెట్టు యూరం తయు నూడలతో నాక్రమించుచున్నది కదా! ఏమి ప్రయత్నముచేసి యట్లెదుగుచున్నది.