పుట:Rasikajanamamobhiramamu (IA rasikajanamamobh022607mbp).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గలసి సువర్ణగేహమునఁ గామసుఖోన్నతిఁ గేరె దీ విఁకన్.

114


క.

కప్పురపుబూది పైపై, గప్పుచు నున్నది యనంటిఁ గనుఁగొనుము సఖా
యప్పొలఁతి సురతవేళలఁ, గప్పును నీమేన వలపుఁ గప్పుర మధిపా.

115


క.

కలరవ మల్లదె యింపుగఁ, బలుకుచు నున్నయది చూడు ప్రాణసఖా నిన్
గలసి రతికేళివేళల, గళరవ మొనరించు నట్లు కలికి నృపాలా.

116


క.

పలుమఱుఁ బూఁదేనెలు మెయిఁ, జిలికెడు నిదె చూడు పొగడ చెలికాఁడ మహీ
తలనాథ నీపయిన్ హిమ, జలపూరం బిట్లు లలన చల్లెడుఁ జుమ్మీ.

117


క.

లికుచము లివె చూడుము కే, లికి సొం పొనరింపఁ జాఁగె లీలాసఖుఁడా
యెకీమీఁడ యల్ల జవరా, లికుచంబులు నిట్టు లలరులే నీచేతన్.

118


తే.

హరిణి నల్లదె కాంచు మొయ్యన వయస్య, పట్ట నబ్బక వడి లేచి పఱచుచున్న
దహహ ధరణీశ యమ్మనోహరవిలాస, హరిణి నీ కబ్రముగఁ జేతి కబ్బుఁ జుమ్మ.

119


తే.

అనుచు నర్మోక్తు లాడుచు నవనిజాని, వనపదవినోదములు గనుంగొనుచు నుండె
ననిన విని దేవముని నల్వ నవలికతయుఁ, దెలుపవే యని తవిలి ప్రార్థించుటయును.

120


మ.

దళితారాతినిశాట భాసురవియ్యద్గంగాజటాజూట మం
జులరాజార్ధకిరీట ఘోరసమరక్షోణీనిరాఘాట ని
స్తులవేదత్రయ ఘోట పాణితమహాదోషాటవీఝాట ని
ర్మలధౌతాచలకూట దుష్టపలభుగ్భ్రామ్యత్పురోఘాటనా.

121


క.

డిండీరపుండరీకా, ఖండలశుండాలచంద్ర ఖండపయశ్శ్రీ
ఖండాఖండయశోవృత, కుండలిమండలవిభూష కుక్కుటవేషా.

122


మాలిని.

కథితశుభచరిత్రా గ్రావకన్యాకళత్రా
మథితవిమతగోత్రా మౌనిసంస్తోత్రపాత్రా
ప్రథనదితిజజైత్రా భక్తచిత్తాబ్జమిత్రా
పృథులధవళగాత్రా భీకరోగ్రాగ్నినేత్రా.

123


గద్యము.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రా
జ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచిగంగానామాత్యపు
త్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ తిమ్మకవిసార్వభౌమప్రణీతం బ
యిన రసికజనమనోభిరామం బనుశృంగారరసప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.