పుట:Rangun Rowdy Drama.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

రంగూన్‌రౌడీ.

గంగా - గిరికుమారీ! నాదయయెంత! నే నెంతగాని, ఈమందిరము యీ దర్జాచూస్తే కాకినాడలోకన్నా కావలసినన్ని రెట్లు సౌఖ్యంగా ఉన్నావని తోస్తుంది,

గిరి - ఇదందా మీచలవే ! సేట్‌గారూ! నిలువబడేవున్నారు. కాస్త వినోదంగా మాపిల్ల నృత్యం చేస్తుంది. కాలం గడుపుతూ ఉండండి. ఈలోగా మీరెప్పుడూ చూడని అప్సరసను తెచ్చి అమురుస్తాను. పిల్లా! సేటుగారిముందర కాస్సేపు నృత్యం చెయ్యి.

(నిష్క్రమించును.)

(నృత్యాంగన నృత్యము చేయుచుండును. సేటు ఆనందించుచుండును.)

గిరి - (అలంకృతయైన ప్రభావతితో ప్రవేశము.) (సేటుగారితో రహస్యముగ) సేట్ మహరాజ్ ! ఇది కొంచెము క్రొత్తగిత్త. మాలిమి అగువరకు మచ్చికపరచుకొని శ్రమపడవలెనేమో. అలవాటుపడినదా అనుభవమునకు లోటులేదు. ఐనా రసజ్ఞులైన మీకు చెప్పవలసిన దేమున్నది ?

గంగా - (రహస్యముగ) మీరందఱు తప్పుకోండి. నాతంటాలేమో నేను పడతాను.

ప్రభా - (స్వగతము) ఆహా దైవమా ! మరల నన్నెన్నికష్టములపాలొనరింప సంకల్పించితివి ? ఇది యొక వేశ్యాగృహమువలె తోఁచుచున్నది. స్వార్థపరురాలగు నీజారిణి నన్ను రక్షించునెపమున లంజరికముచేయింప సంసిద్ధురాలైనది.

ఉ. ఆకటఁ జావనున్న నను నాగతి నంతము నందనీక , పొ
     పాకరమైన జారిణిగృహంబునఁ జేరిచి లోకు లెల్లరుం
     గాకులవోలె నవ్వనగు కట్టడిలంజరికంబు సల్పగా
     నాకు విధించినాఁడనె ఘనంబగు పాపఫలంబుగా? విధీ !

ఇంక నాకెవ్వరు రక్షకులు? ఎవ్వరు నామొరాలించువారు ? ఎవ్వరు.