పుట:RangastalaSastramu.djvu/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అభినయావరణ సక్రమ వినియోగము.

బరువైన ఇతివృత్తంగల నాటకాలలో ఈ లోతు ఎక్కువగా ఉండవలె. దృశ్య సమీకరణలోకూడ అదే ప్రాతిపదికమీద జరగవలె. నాటక ప్రదర్శనలో నటీనటులు ప్రేక్షకులకు దగ్గరగా రావటానికి ప్రయత్నించటం ఒక మామూలు బలహీనత. దర్శకుడు అప్రమత్తుడై ఈ ప్రయత్నాన్ని, స్వభావాన్ని ఎప్పటికప్పుడు అరికట్టకపోతే వీరంతా కింది దీపాలకు (foot lights) ఎదురుగా బారులుతీరే ప్రమాదమేర్పడి, దృశ్య సంరచన దెబ్బతింటుంది. అంతేకాదు. దృశ్యసంరచన వెనక ఉన్న పద్ధతిని, ఉద్దేశాన్ని తెలుసుకోవటం వీలుపడక, దాని ప్రధాన ఫలితము ప్రేక్షకులపైనపడి అనాలోచితంగాను, అప్రయత్నంగాను వారి అనుభవానికి వస్తుంది. కాబట్టి సంరచనవెనక ఉన్న కృషిని, పద్ధతిని, ఉద్దేశాన్ని దర్శకుడు మరుగుపరిచే ప్రయత్నంచేసి కళాత్మకంగా రూపొందించవలె.

సంరచనలో కిందిసూచనలు దర్శకునికి ఉపయోగిస్తాయి.

1. మూలాంశాలు (elements) ఏవైనా రంగచిత్రము (stage pictures),అంగవిక్షేపము (gesture) సంభాషణ (di8alogue), నాటక సమగ్రరూపము (The play as a whole) ఒకపద్దతిప్రకారము సంరచన (composition) చేయవలె.

2.సంరచనలోని కృషి, ప్రయత్నము (attempt) బహిర్గతము కారాదు.

3. సంరచన ఎట్టిసందర్భంలోనూ ప్రద్రర్శనానుభూతికి, ప్రేక్షక పరానుభూతికి (audience empathy) అపశ్రుతి కల్పించరాదు.

ఇట్లా చేయటంవల్ల, సంరచన సుందరంగాను, ఆకర్షణీయంగాను ఉంటుంది. అది సరళంగాను, అర్ధరహితమైన వైరుద్యాలు లేకుండాను ఉంటేనే సాధ్యమవుతుంది. రంగాలంకరణలోను, రంగగీపనలోను శక్తిమంతాలైన వర్ణాలే వాడవలె. సహజత్వము కలిగిన వాస్తవికశైలి గల నాటకాలలోను. ప్రహసనాటకాలలోను (Ferces), మెలోడ్రామా (Melodrama) లోనూ సంరచన సుందరంగా ఉండటం అభ్యంతరకరంగా ఉంటుంది.

ఏదైనా క్రమపద్ధతిలో దృశ్యసంరచన జరిగినప్పుడు అది దర్శకుని భావనాశక్తిని, నటీనటుల పాత్రోచిత భావప్రకటనలను ప్రేక్షకులు సక్రమంగా గ్రహించి పరానుభూతిని పొంది, నాటకము రససిద్ధిని సాధించేటందుకు దోహరము చేయగలదు.