పుట:RangastalaSastramu.djvu/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సక్రమమైన ఎన్నిక, క్రమపద్ధతి కళాసృష్టిలో ముఖ్యాంశాలు. నాటక ప్రదర్సనలో భావాత్మక (intellectual) మైన, ఉద్వేగాత్మక (emotional) మైన విలువలను నాటకీయమైన విలువలతో (dramatic values) కూర్చి, ప్రేక్షకులకు సమర్పించడమే సంరచన. సరిఅయిన సంరచనవల్ల, నాటకప్రదర్శన రక్తికట్టి ప్రేక్షకులకు ఆనందము కలిగిస్తుంది.

సక్రమమైన ఒక పద్ధతి ప్రకారము ఎన్నికచేసిన భాగాలు, ఆ క్రమ పద్ధతిలో ప్రదర్శించినపుడు, వాటిస్వరూపము చూసేవారి మనస్సులో సులభంగా హత్తుకొంటుంది. ఉదాహరణకు: ఐదురూపాయలు నాలుగేసి పావలాల చొప్పున ఐదు దొంతరలుగా అమర్చి పెట్టినప్పుడు, అవి ఐదురూపాయలని తెలుసు కోవటం ఎవరికైనా చాలా తేలిక. అదే ఐదురూపాయల చిల్లరనాణేలు కుప్పగా పోస్తే అది ఎంతో తెలుసుకోవటం కష్టమవుతుంది. చాలామంది చిల్లర లెక్కపెట్టేటప్పుడు ఆనాణేలను విలువలవారీగా ఏరి, లెక్క పెట్టటం నిత్య జీవితంలో మనకు అనుభవమే.

సంరచనా సిద్ధాంతాలు అనేక పద్ధతుల మీద ఆధారపడి ఉంటాయి. నాటకంలోని ఐక్యము (unity) ప్రాతిపదికగా, శైలి (Style) లోను, భావంలోను ఐక్యాన్ని సాధించటం నాటకప్రయోగ పద్ధతులలో ముఖ్యాంశము.

ఈ కళాత్మక సంరచనకు (artistic composition) అవసరమయ్యే సిద్దాంతాలు ఒకనియమిత క్రమపద్ధతిలో ఉంటాయి. ఉదాహరణకు: సంగీతంలొ శ్రుతి లయలు నియమిత క్రమపద్ధతులు చిత్రలేఖనంలో వర్ణచక్రము (colour wheel) ఆధారంగా ఈ క్రమపద్ధతి రూపొందుతుంది. చిత్రలేఖనము, శిల్పము, రేఖా చిత్రలేఖనాలలో (line drawing) వలెనే రేఖలపై నాటకంలొ దృశ్య సంరచన ఆధారపడిఉంటుంది. 'రేఖల అధారంగా ' అనడంవల్ల యాంత్రికంగా, లెక్కప్రకారము, సునాయాసంగా రూపొందేది అనేభావము కల్గకూడదు. ఆ