Jump to content

పుట:RangastalaSastramu.djvu/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏరీతిగా కంఠస్వరము మలచుకోవలెనో, నటనలో దేనిని ప్రస్పుటీకరించవలెనొ, దేనిని తగ్గించి తగుమోతారులో ఉపయోగించుకోవలెనో, రంగస్థలంమీద నటన పుష్టిపొంది, ప్రేక్షకులలో రససిద్ధి కల్గజేయటానికి ఏయే మార్గాలు అవలంభించవలెనో వివరించి నటీనటులకు సాయపడవలె. ముఖ్యంగా పాత్ర పోషణలో పాత్ర - అంతర్గత లక్షణాలు బహిర్గతము చేయడానికీ, అవి కధా సంవిధానానికి అనుకూలంగా ఉండేటట్లు రూపొందించడానికీ నటీనటులకు సలహాలు నీయవలె.

3. దర్శకుడు : ప్రేక్షకులు

దర్శకుడు ప్రేక్షకులయొక్క ప్రతినిధి కనుక, వారు కూర్చునే ప్రదేశము వారికి సౌకర్యంగా ఉండేటట్లు, వారు ఎక్కడ కూర్చున్నా నాటక దృశ్యాలు వారికి కనిపించేటట్లు, వినిపించేటట్లు ఏర్పాట్లు చేయవలె. పూర్వాభ్యాసము జరుగుతున్న అన్ని రోజులలోనూ ప్రేక్షకుల ప్రతినిధిగా ప్రేక్షకాగారం (auditorium) లో కూర్చుండి వారి కొరికలను, అభిరుచులను, ఆశయాలను, అంతర్యాలను ఊహించి నాటకాన్ని రూపొందించవలె. "ఈ పాత్ర చిత్రీకరణ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకొనేటట్లుగా ఉందా "ఈ పాత్ర పోషణలో నటుడు ప్రకటించే ఉద్వేగాలవల్ల తనకే తాదాత్మ్యము కలుగడంలేదే, మరి, ప్రేక్షకులు ఎట్లా ప్రతిస్పందిస్తారు దీనికి కారణ మేమిటి పాత్రధరి అయిన నటుడు ఆ పాత్ర స్వరూప స్వభావాలను సరిగా అర్ధంచేసుకోలేదా" ఇట్లాంటి ప్రశ్నలు వేసుకొంటూ దానికి తగిన సమాధానాలు ఊహించుకొని, ఉచితమైన మార్పులు చేర్పులు చేసి, నాటకానికి మెరుగులు దిద్ది, ప్రేక్షకామొదము, ప్రశంస పొందేటట్లుగా ప్రదర్శన విజయవంత మయ్యేటట్లుగానూ రససిద్ధి కలిగేటట్లుగానూ కృషి చేయవలె.

ఈవిధంగా దర్శకుడు నాటకానికి సంరక్షకుడు, ప్రయోగానికి సారధి. నటీనటులకు అధినేత, రచయితకు ప్రధాన భాష్యకారుడు. ప్రేక్షకులకు మిత్రుడు. కాగా, రచయిత భావేద్దేశాలను శాస్త్రీయంగా, సమగ్రంగా పరిశీలించి, సాంకేతికమైన విలువలు చేర్చి, పుస్తకగతంగా ఉన్న నాటకాన్ని సజీవమైన సమూలమైన ప్రదర్శ్నగా పున:సృష్టి చేయగల సృజనాత్మక కళాకారుడే దర్శకుడు.