పుట:RangastalaSastramu.djvu/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకప్రయోగము ఒక కళ, ఈ ప్రయోగానికి సూత్రధారుడు దర్శకుడు. నాటకము మొదట రచయిత ఊహలో పుట్టి, స్థూలంగా ఒక రూపాన్ని సంతరించుకొన్నప్పటికీ తరవాత దాన్ని రంగస్థలంమీద ప్రదర్శించేవరకూ పరిపూర్ణత కల్గదు. రచయిత నిర్మించిన ఒక బొమ్మకు ప్రాణముపోసి, దానిచేత ఆడించి, పాడీంచి, మాటాడించే ప్రజ్ఞ దర్శకునిదే. ఒక నాటకంలొ రచయిత యొక్క సాహిత్యప్రతిభ ఎంత ఉన్నా - అది, నాటకాన్ని సజీవంగా, రంగస్థలంమీద ప్రదర్శించడంకోసం దర్శకునకూ సాంకేతిక నిపుణులకూ నటీ నటులకూ అవసరమైన సూచనాత్మమైన సూచనాత్మక సృష్టి మాత్రమే. అసలు, రంగస్థల కళ (Theatre Art) స్సమిష్టి కళ (group art), ఇందులో దర్శకుడు సాంకేతిక నిపుణులు, నటీనటులు మొదలైనవారితోపాటు ప్రేక్షకులు కూడా భాగస్వాములే. వీరందది సమష్టి కృషి ఫలితంగానే ఈ సృజనాత్మక కళ (creative art) పరిపూర్ణత పొంది, మానవ్వునిలో అపార రసానుభూతినీ, పరానుభూతినీ (empathy) కల్పించి, ఆనందాన్ని కలిగిస్తుంది. అప్పుడే రచయిత రచించిన ఆ దృశ్య కావ్యము ఒక సజీవ ప్రదర్శనంగా రూపొందుతుంది.

మొత్తంమీద, రచయిత రచించిన నాటకాన్ని రంగస్థలంమీద ప్రదర్శించేవరకూ జరిగే కార్యకలాపాల సక్రమ, కళాత్మక నిర్వహణే దర్శకత్వ మన్నమాట. నాటక నిర్ణయము, పాత్ర నిర్ణయము, నాటకోద్దేశ సృష్టీకరణము, గమనవేగము, ప్రదర్శన పద్ధతి, శైలి, రంగాలంకరణము, కదలికలు, దృశ్య చిత్రీకరణల సమీకరణ పద్దతులు మొదలైన అంశాలన్నింటికీ దర్శకుదే బాధ్యత వహించి, నిర్వహించవలె. దర్శకుడు, ద్శశ్య సమీకరణ మొదలైన పద్దతుల ద్వారా నాటకంలోని విలువలను ప్రేక్షకులకు అందిస్తాడు. దర్శకుని సూచనల ననుసరిస్తూ నటీనటులు అంగ విక్షేపాలు (gestures) ద్వారాను, వాచిక సాత్విక - అభినయాల ద్వారాను ఈ విలువలను వ్యక్తీకరిస్తారు.