Jump to content

పుట:RangastalaSastramu.djvu/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయ వ్యాయోగము (1894), ప్రసన్నరాఘవము (1897) అనే రూపోకాలనుకూడా అనువచిందారు. వీరిభాష వీరగ్రాంధికభాష, ఈ కాలంలోనే అంటే 1872 లోనే పరవస్తు వేంకటరంగాచార్యులుగారు అభిజ్ఞానశాకుంతలాన్ని అనువదించి, మూలంలోని ప్రాకృత భాషల స్థానంలో అచ్చతెలుగు వాడినారు.

1857 నాటికి మద్రాసు విశ్వవిద్యాలయము నెలకొనడంతో మద్రాసు రాష్ట్రంలో ఇంగ్లీషు విద్య వ్యాప్తిచెందింది. తెలుగువారికి ఇంగ్లీషు నాటకాలతో పరిచయ మేర్పడింది. షేక్స్ పియర్ నాటకాలు మనవారికి ఒక కొత్త ప్రపంచాన్ని చూపినవి. షేక్స్ పియర్ నాటకాలకు ముగ్దులై ఆ నాటకాలను తెలిగించడానికి తెలుగు యువకులు పూనుకొన్నారు. అట్టివారిలో ప్రప్రధములు వావిలాల వాసుదేవశాస్త్రిగారు. వీరు ప్రప్రధమంగా 1875 లో షేక్సి పియర్ వ్రాసిన జూలియస్ సీజర్ నాటకాన్ని తెలుగులో అనువదించి పాశ్చాత్య నాటకానువాదాలకు దారితీసునారు. ఈ అనువాదంలో మూలంలోని పేర్లు మార్చలేదు. నాటకమంతా తేటగీతిలోనికి అనువదించినారు. కాబట్టి తెలుగులో స్వతంత్ర పద్యనాటక రచనకుకూడ వీరే ఆద్యులు. వీరి నందకరాజ్యము అనే నాటకము తొలి స్వతంత్ర పద్యనాటకము. ఆ నాడు ప్రబలంగాఉన్న నియోగి వైదికి కక్షలను విమర్శిస్తూ హితోపదేశ జనకంగా ఈ నాటకము రూపొందిచబడినది. అయితే ఈ కాలంలో నాటకరచన ప్రారంభమయిందేగాని నాటకరంగము ఆవిర్భవించలేదు.

వీధినాటకాలు, పగటివేషాలు, తోలుబొమ్మలవంటి జానపదకళారూపాలు ఆధునిక ఆంధ్ర నాటకరంగోదయానికి తొలిరేఖలు.

ఆంధ్రనాటక సాహిత్యచరిత్రలొ 1880 సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంవత్సరము. ఆ సంవత్సరమే ధార్వాడకంపెనీవారు ఆంధ్రదేశంలో పట్టణపట్టణాన నాటకాలు ప్రదర్శించినారు. అదే సమయంలో రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు బ్రాహ్మవివాహము, వ్యవహార ధర్మబోధిని అనే రెండు ప్రహసనాలను రచించి ప్రకటించినారు. బ్రాహ్మవివాహప్రహసనాన్ని జనము తండోపతండాలుగాచేరి చదివించుకొని వినేవారు. దీనినిబట్టి ఆ ప్రహసనము ప్రజలలోకి ఎంత బాగా చొచ్చుకొనిపోయినదో తెలుస్తుంది. 'వ్యవహార షర్మబోధిని ' బాలికోన్నత పాఠశాలలో మొదటిసారి ప్రదర్శింపబడినది. ఇవే తొలి తెలుగు రూపకప్రదర్శన.