పుట:Ranganatha Ramayanamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మునిలోకనుతుఁ డైన మునిభరద్వాజుఁ - గని నమస్కారముల్ గావించి తనదు
వృత్తాంత మంతయు విన్నవించుటయు - నత్తపోధనముఖ్యుఁ డారాఘవులను
దీవించి రఘురాము దేవువర్తనము - భావించి యచ్చెర్వు పడి తత్త్వ మెఱిఁగి
కందమూలఫలాదికంబుల వారిఁ - బొందుగా సంతుష్టి పొందించి ప్రేమ1060
నమ్ముని పూజింప నారాత్రియందు - నెమ్మి దీపింపఁగ నిల్చి, మర్నాఁడు
ఘననిష్ఠ సంధ్యాదికర్త ముల్ దీర్చి - మునులయాశీర్వాదములు చాలఁ బడసి
యరుదైనచిత్రకూటాద్రికిఁ దెరువు - వరపుణ్యుఁడగు భరద్వాజుచే నెఱిఁగి
యరుగుచో రాముఁ డయ్యడవులనడుమ - నురుచాపరవమున కురుకుచు బాఱు
మృగములఁ జూపుచు మేదినీసుతకు - నగవుఁ బుట్టించుచు నడతెంచు నడల
నలసి డస్సినచోట నవనీరుహములు - నిలిచినచోటను నిలిచి తోడ్కొనుచుఁ
గరమర్థిఁ బెక్కుదుర్గంబులు గడచి - వరపుణ్యు లట సిద్దవటము నీక్షించి
సీత యప్పుడు కార్యసిద్ధులు గోరి - యాతరువరమున కంజలి చేసి
ప్రార్థింప నప్పు డా పార్థివతనయు - లర్థితో యమున మహానది దాఁటి
యారాత్రి యందుండి యమ్మఱునాఁడు - ఘోరాటవులు చొచ్చి కుశలమార్గమున1070
వలనొప్పఁ జని మాల్యవతిచుట్టుఁ బాఱి - యలఘుసంయములకు నాటపట్టగుచు
సలలితతరులతాసానుకూటములు - చెలువు వాటించినఁ జిత్రకూటాద్రి
గని యెక్కి యందున్న ఘనతపోధనులఁ - గని మ్రొక్కి మిగులసత్కారము ల్వడసి
యమ్మునీంద్రులచేత ననుమతి వడసి - తమ్ముఁడుఁ దాను నత్తఱి మహీజముల
కొమ్మలు ఖండించి కొంతవింతగను - సమ్మదంబునఁ బర్ణశాలఁ గావించి
కృష్ణసారముఁ జంపి గృహశాంతిహోమ - ముష్ణాంశుకులుఁడు శాస్త్రోక్తిమైఁ జేసి
యందుఁ బ్రవేశించి యాపర్ణశాల - చందంబు మెచ్చుచు సాధ్వియుఁ దాను
మునులు సేవించుచు మునులెల్లఁ బొగడ - మునిచరిత్రంబుల మోదించుచుండె.
తనతొడ నొకనాఁడు తలయంపిగాఁగ - నునిచి రాముఁడు గూర్క నుర్వీతనూజ
యొగిఁ గందమూలాదు లుపహారమునకుఁ - దగ నాయితము సేయుతఱి భీతిలేక
కడఁకతో నొకదుష్టకాకంబు శాల - నొడియుచు గాసిసేయుచునున్నఁ జూచి
సీత యాకాకంబుఁ జెచ్చెరఁ జోప - నేతెఱంగునఁ బోవ కీడాడఁ జూచి
చనుఁగవనడుచక్కిఁ జంచునఁ బొడువ - ఘనశోణితం బొల్కఁగా నిద్ర దేరి
కడునల్గి రాముఁ డాకాకంబుఁ జూచి - వడినిషీకముఁ బుచ్చి వైచె వైచుటయు
విడువక యది దాని వెనువెంటఁ దగులఁ - దడయక యది జగత్రయ మెల్లఁ దిరిగి
కావుకా వనుచు దిక్పాలుర బ్రహ్మ - దేవుని నమ్మహాదేవుఁ బ్రార్థింప
వారలు తమచేత వారింపఁబడునె - శ్రీరామశర? మన్న శీఘ్రంబు మగుడఁ
జనుదెంచి మఱి తన్ను శరణుఁజొచ్చుటయు - ఘనమైనకృపతోడఁ గాకంబుఁ జూచి