పుట:Ranganatha Ramayanamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుమంతుఁడు అయోధ్య చేరుట

మనవుడు రథ మెక్కి యతిదీనుఁ డగుచుఁ - జనియె సుమంతుండు సాకేతపురికి.
అంత రాఘవుఁ డయోధ్యాపురి కపుడు - నంతరంగంబున నతిభక్తి మ్రొక్కి
గుహుఁడు పెట్టినయోడ కొమరొప్ప నెక్కి - యహిమాంశుకులు నంత నాగంగ దాఁట
నడుమ జానకి గంగ నటు చూచి మ్రొక్కి - కడువేడ్కఁ బ్రార్థించి కరములు మొగిచి.1030
‘‘దశరథేశ్వరునాజ్ఞ ధరణి వర్ణించి - దశ చెడి రాముఁడు దంటకాటవిని
బదునాలుగేఁడులు భవ్యవృత్తులను - విదితంబుగా నేను వీరితోఁ గూడ
సంచరించియు రాము సౌమిత్రు లంత - నంచితశుభముచే నలరువేడుకల
వచ్చిన నీకును వలనొప్పఁ గాను - నిచ్చెద గోవు లనేకముల్ వస్త్ర
దానమృష్టాన్నాదిదానంబు లమర - గాను భూసురులకుఁ గానుక నిత్తు;
సురఘటల్ వేయింటి శుద్ధాన్నమాంస - మరయఁ బెట్టెద నమ్మ!" యని భక్తిఁ గొలిచి.
భవభంగ ధవళాంగ భవమౌళిసంగ - నవనిజ యాగంగ నర్థిఁ బ్రార్థించె.
గుహుని సంభావించి గుహు వీడుకొలిపి - గుహుఁడు మార్గజ్ఞులఁ గొందఱఁ గూర్ప
ముందఱఁ గూర్మితమ్ముఁడు వెన్కఁ దాను - సుందరి నడుచక్కిఁ జూపట్టఁ గదలి
వనచరమృగముల వరుస జానకికిఁ - గనుపట్టఁ జూపుచు ఘనుఁడు రాఘవుఁడు1040
చని యొక్కమౌనియాశ్రమమును జేరి - మునిపతి కతిభక్తి మ్రొక్క నామౌని
వారలఁ గన్గొని వల్కలాదికము - గారవంబును బెంచఁగాఁ బల్కె నిట్లు
లే నెఱింగితి మీర లిట వచ్చుపనిని - ఈదిన మిం దుండి యెల్లి పోవలయు
అనఘుఁ డారాఘవుఁ డనియె గ్రమ్మరుచు -"మునినాథ! సెలవిమ్ము ముదముతో” ననిన
"రఘుకులోత్తంస! యీరమణీయమైన - యఘనాశ మైన యీయాశ్రమభూమి
నిలుతురు గాక" యనిన రఘూత్తముఁడు - పలికెఁ గ్రమ్మఱ మునిపతి కిట్టు లనుచు
“నిక్కడ మాకుండ నేల పోయెదము - అక్కట! మునినాథ! యదియును గాక
మాతల్లిదండ్రులు మాపురవాసు - లేతెంచి మముఁ జూడ నిట వత్తు" రన్న
నామాట కలరి యిట్లనియె నమ్మౌని - యీమాట నిశ్చయంబే రామ యిపుడు
పద మని సెలవిచ్చి పరమపావనుఁడు - వదలని ముదమున వారల కనియె.
'జననాథ! మూఁడుయోజనములు నడువ - ననువొందఁ జిత్రకూటాఖ్యఁ జెన్నొందు,"
ననవుడు రాఘవుఁ డౌఁగాక! యనుచు - జనకజాసౌమిత్రిసహితుఁడై యప్డు
చనిచని మూఁడు యోజనములు గడచి - చని సుధర్మదయను సరసి నాఁ డుండి1050
యారాత్రి భూపుత్త్రి యతిమృదుగాత్రి - కారడవిని నొంటిగా శయనించి
యున్నచందంబు తా నున్నచందంబు - కన్నతల్లుల కైన కష్టశోకంబు
కైకేయికోర్కులు కడముట్టుటయును - భూకాంతుసత్యంబు భూప్రజవగయుఁ
గన్నీరు దొరుగ రాఘవుఁడు లక్ష్మణుని - కన్నియుఁ జెప్పఁగా నట వేఁగెఁ బ్రొద్దు
మనువంశతిలకు లామఱునాఁడు కదలి - మునుమిడి యోజనంబులు మూఁడు గడచి
అనఘ గంగాయమునలు గూడి యునికి - గనుఁగొని యటఁ బ్రయాగకుఁ బోయి, యందు