పుట:Ranganatha Ramayanamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాన నీవిధమునఁ గాంతారమునకు - భానుకులేశ! నీపాదముల్ గొలిచి
వచ్చెద నన్ను రావల దనవలదు - వచ్చిన మదిని నాభక్తియుఁ జూడు”590
మని పాదములఁ బట్టి యడలంగ వగచి - యనుమతింపమిఁ జూచి యతిదీన యగుచు.
“యెఱిఁగి నే చేసితినే మున్ను తప్పు - మఱచి చేసితి నేను మన్నింపు నన్ను
పటుశిలాకుటిలకప్రచురదేశములు - నట నిన్నుఁ గొలిచిరా నలఁతయు లేదు
కరుణమై నీ విచ్చు కందమూలములు - నరుదార నమృతంబు లవియును నాకు
భావించి చూచినఁ బ్రాణబంధుఁడవు - నీవె కావున వత్తు నీతోడఁ బ్రీతి
జనకుఁడు చింతింప జనని చింతింప - చను నిష్టులగుబంధుజనులు చింతింప
జననాథ! సహధర్మచారిణియందు - జనకునిచే నగ్నిసాక్షిఁ గైకొంటి;
జనలోకనుతుఁడవు సత్యసంధుఁడవు - నను డించి నీకుఁ గానల కేగఁదగునె?
యెన్నిదుఃఖము లైన నెన్నికఁ గాదు - అన్నియు సౌఖ్యంబు లగును నీదయను
ఈవాడ లీమేడ లీబంధుబృంద - మీవస్తుసంపద లీజీవనంబు600
నీవు లేకున్నచో నిస్సార మరయ - గావున నిచట నేకరణివేగింతు
సావిత్రి యనుపుణ్యసతి తనపతిని - సేవించినట్టి యాచెలువున నేను
నీవెంటఁ జనుదెంతు నీనీడఁ బోలె - నావంటిసాధ్వికి నదియె ధర్మంబు
నినుఁ బాసి యిచ్చట నిమిష మే నోర్వ - వనముల నినుఁ గూడి వర్తింపనేర్తుఁ
బదునాలుగేం డ్లేల పాసెద నిన్ను - కదిసి వెయ్యేండ్లైనఁ గడువేడ్కఁ గొలుతు
సతులకుఁ బతులకు జను లెంచఁదగిన - మతము ప్రతిష్ఠింపు మఱి వేయునేల
నీ వరణ్యములకు నిట నన్ను విడిచి - పోవుట నిజమైనఁ బోవుఁ బ్రాణములు
నలుకమైఁ గాదేని యగ్నిచే నైన - జలముచే నైన విషంబుచే నైన
యేచినవగలతో నిటఁ జత్తు నేను - నాచూపు డించిపో నను దించిపోకు”
మని ప్రలాపించుచు నడుగులమీఁదఁ - జనకజఁ బడియున్నచందంబు చూచి610
కరుణతో నల్లనఁ గరపల్లవముల - ధరణీశతనయుఁ డాతనుమధ్య నెత్తి

సీతరాకకు శ్రీరాములు సమ్మతించుట

"యలివేణి నినుఁ బాసి యావనంబులను - నలువంద విహరింప నా కిచ్చ లేదు,
నినుఁ దోడుకొని పోదు; నీవు నావెంట - చనుదేరఁ గుశలంబు సకలంబు నాకు.
నిమ్ముల నీచిత్త మెఱుఁగంగఁ దలఁచి - యిమ్మాట లాడితి నేతెంతుఁగాని”
యనుచు నారఘురాముఁ డతికృపామూర్తి - జనకజరాకకు సమ్మతించుటయు
వలయుదానంబులు వరుసఁ గావింపు - నెలఁత! నీ వనవుడు నెమ్మనం బలరఁ
గాంచనరత్నాదికంబు లైనట్టి - యంచితదానంబు లమ్మహీసుతయు
వరుస ప్రియంబగువారల కెల్ల - కరమర్థి నందందఁ గావించె నంత.