పుట:Ranganatha Ramayanamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నారచీరలు గట్టి నడచుచు వగలఁ - గూరుచుఁ బేరెండకును గాలి కోర్చి
నేలలఁ బవళించి నిచ్చలు పర్ణ - శాలలలో నుండఁజాలుదే యకట!
కోమలదేహపుగోలవు బేల - వేమియు నేపాటు నెఱుఁగవు నీవు
తలఁప నక్కజమైన దంతులు పులులు - నెలుఁగులు తోడేళ్లు నిఱ్ఱులు కరులు560
పాములు గాములు పైఁబ్రాకు నెఱ్ఱ - చీమలు గిరిగుహాసీమల దరుల
ఝరుల నిమ్ములలతాశ్చర్యమార్గముల - విరసకంటకలతావృక్షమార్గముల
దలఁప నక్కజమైన దారుణాటవుల - మెలఁగుట యక్కటా! మేదినీతనయ!
కావునఁ గౌసల్యకడ నుండు మీవు - సేవింపు మాసాధ్వి చిత్తంబు వడసి
గృహదేవతలఁ గొల్వు కీర్తింపు నన్ను - నహరహంబును మామయడుగుల కెఱఁగు
భరతుండు నిను మాతృభావంబు గొలుచుఁ - బరుసంబు లాతనిఁ బలుకకు మబల!
యిదె పోయి పదునాలుగేండ్లు నిండించి - ముద మొప్పఁ జనుదెంతు ముగుద! చింతిలకు"
మనవుడుఁ బ్రణయశోకార్తయై రాముఁ - గనుఁగొని సీత నిక్కము విన్నవించె.
‘‘పతులు గావించిన భాగ్యంబు లైన - సతులను రక్షించు సమ్మదం బెసఁగ570
నాపాలివిభుఁ డన్న నాదైవ మన్న - నాపుణ్యగతి యన్న నరనాథ! నీవె;
ఘనతపస్వర్గభోగము లనేకంబు - లనుభవించుటకంటె నతిభక్తితోడ
నిశ్చలమన మార నీపదాంబుజము - లచ్చుగాఁ గొలుచుట యది నాకు సుఖము
నృపవర్య! నీ వున్న నిష్ఠురాటవులు- యుపవనంబులు నాకు నూహించి చూడ
జగతీశ! విను విష్ణుసముఁ డైన నీవు - జగదేకవిక్రమశాలివై పరఁగఁ
గరమొప్ప నీరక్ష గలిగిన నన్ను - సురరాజు తలయెత్తి చూడంగ వెఱచు.
నారచీరలు గట్టి నడచి నీతోడ - నారంగఁ జనుదెంచ నట నీవు చూప
నమరంగఁ జూచెద నద్రులు నదులు - కమలాకరంబులు కడువేడ్కతోడ
పాయనియందును పరఁగ నూఱైన - వేయైనఁ గానిమ్ము విపినంబులందు
నన్నుఁ దోడ్కొనిపొమ్ము నరనాథ” యనిన - నన్నాతిఁ గనుఁగొని యతఁ డిట్టు లనియె580
"అనిశంబు నతిదురంతాయాస మైన - వనవాస మేటికి వనజాక్షి నీకు?
నీయందుఁ జిత్తంబు నిలిపి ని న్నునిచి - పోయి కావించెద భూపాలుపనుపు
వన మేడ నీ వేడ వనిత ని న్నేడఁ - గొనిపోయి దుర్గముల్ కుటిలమార్గముల
నారామవనకేళి కర్హంబు గాని - ఘోరాటవులయందు గ్రుమ్మరఁ దగునె?
పెల్లుకూరవృకాళిపృథుపుండరీక - భల్లూకసింహాదిబహుమృగావళులు
ఘూకశాకానేకఘోరహుంకార - కాకోలమల్లికాకర్కశధ్వనులు
మానక వర్తించు మఱి భయం బొదవ - నీనీడ తక్కు నీ వెందున వలదు”
నావుడు విని సీత నరనాథుఁ జూచి - నీ వుండఁగా నాకు నిర్భయం బధిప!
వనభూమిఁ దిరుగుదు వరుసతోఁ గూడ - దని నాకుఁ జెప్పినా రా వేదవిదులు?