పుట:Raajasthaana-Kathaavali.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృథివిరాజు సాహసములు.

65.


దండించుచు దొంగల నడఁచుచు హాయిగ నుండె. రాజపుత్రులనేకు లామహావీరునిఁ గొలుచుటకు వచ్చి యాతఁడు చిచ్చురుకు నున్న నురుకుటకు సిద్ధముగ నుండిరి. ఇట్లుండి పృథివిరా జోకనాడు తండ్రిని దర్శించుటకు చిత్తూరునకు వచ్చెను. అప్పుడు రాయమల్లుఁడు మాళవ రాజుయొక్క సేవకునితో మిక్కిలి చనువిచ్చి తనగౌరవమునకు దగనట్లు వానితో మాటలాడఁజొచ్చె. ఆసంభాషణము విని పృథివిరాజు సేవకుఁడు చనినవెనుక తండ్రినిఁ బిలిచి యట్టినీచుల కంత చను విచ్చి మాటలాడుట రాణావంటివాని కనుచిత మనియు నాఁడు జరిగిన సంభాషణము తనకే కాక రాజ బంధువుల కందఱకు నలుక పుట్టించిన దనియు నట్టిచనువు లింక నియ్యగూడ దనియు జెప్పెను. రాయమల్లు, డామాటలు విని కుమారునితో "నాయనా! నీవు మహాసాహసుఁడవు రాజులంబట్టి బంధిపఁగలవు. నా కంత ప్రయోజకత్వము లేదు. నేను చుట్టుపక్క రాజులతో మంచిమాట చేసికొని యెట్టెటో నారాజ్యము గాపాడుకొను చున్నాడ” నని ప్రత్యుత్తర మిచ్చెను.

పృథివిరా జది విని తండ్రికి మాటలతో నుత్తర మియ్యక వెంటనే యచ్చోటు వాసి తన నెలవునకుం బోయి యొకసేనం గూర్చుగొని మాళవ దేశముపై దంచువిడిసె. మాళవరాజు వానిదౌర్జన్యము నకు సైపక మహాసేనాసమేతుఁడై వేశ్యాంగనల యాటపాటలు, హెగ్గడల హెచ్చరికలు, వందిమాగధుల కైవారములు సెలంగ మహేంద్ర వైభవముతోఁ గయ్యమునకు బయలుదేరెను. ఈమహాసేన యొకనాటిఱేయి యొకచో విడిసియుండి సంగీత సాహిత్యములతో మహాకోలాహలము చేయుచుండ రాజు గుడారమునకు సమీపమున పెద్దకలకలము పుట్టెను. అది యేమగు నని కొందఱు చూచునప్పటికి శూరశిఖామణులు కొంద ఱాయుధ పాణులై గుఱ్ఱముల నెక్కి శిబిరముం జొచ్చి నిర్భయముగా రాజున్న కడ కరుగుచుండిరి. ఆకస్మికముగా శత్రువులు పయింబగుటచే మాళవ సైనికులు నిశ్చేష్టులై పగతురను