పుట:Raajasthaana-Kathaavali.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చండునీ కథ.


గర్వితు లగువాని మేనమామల కనుమానము గలిగింపదయ్యె. నల్లమందు ముద్దలు మింగుటచే మతిలేకయో పడుచుపెండ్లాము వలపులఁ దగులుటచే నొడ లెఱుఁగకయో వానితాత యావిషయము దలపెట్టడయ్యె. ఇట్లు దినములు జరుగుచుండఁ జిత్తూరున కేడుమైళ్ళ దూరమున దక్షిణముగానున్న గోసుంద యను గ్రామమున దీపావళివండుగ నాఁడు రాణి హంసాదేవి లక్ష్మీ పూజ చేయించి గొప్పయుత్సవము గావించి దానింజూచుట కెప్పటియట్ల తనకుమారుని బంపెను. రాచనగరును నిరుపేదవాని గుడిసెయు దీపములతో వెలుఁగుచున్న యామహానందసమయమున చిన్న రాణా యొక్క సేవకులు కొందఱు మిక్కిలి హృదయసంతాప మొంది యేమియుం దోఁచక చిత్తూరుపుర ప్రాంతమున మొగములు వ్రేలవైచి నిట్టటు తిరుగుచుండిరి.

“ఏమి చెపుమా యతఁడు రాఁకపోవుటకుఁ గారణము! అతఁడు చెప్పినట్లు రాణాను గ్రామముల వెంటఁ ద్రిప్పితిమి. దీపావళి పండుగ నాఁడు గోసుందగ్రామమున నతఁడు సెలవిచ్చిన ట్లుత్సవముఁ జేసితిమి. ఈరాత్రి వత్తు నని యతఁడు ప్రమాణము చేసెనే ! ఏలరాకపోవలె? ఆమాట మఱచియుండినా? లేక శత్రువులచే నిరోధింప బడెనా? చండుఁడు రానిపక్షమున మీవారుగతి యింతే.”

అని తలపోయుచు నాబంటులు చిన్న రాణాను వెంటఁబెట్టుకొని తూర్పు ద్వారమువద్ద పూర్వ మలాయుద్దీను వేయించిన దిబ్బఁ జేరునప్పటికీ వారి చెవులకు గుఱ్ఱపుదౌడు చప్పుడు వినఁబడెను. అది యే మగునని నిలిచి చూడ నలువదిమంది యాయుధపాణు లగుజోదులు వచ్చుచుండిరి. అందు మొనగాఁడు మాసినగుడ్డలు నసమానమైన యాయుధములు ధరించి వచ్చి యొక సంజ్ఞఁ జేసి తనరాఁక రాణా కేఱిఁగించెను. ఎవ రావచ్చుచున్న దని కోట కావలివాండ్రు వానిం బలుకరించిరి. మే ముత్సవముఁ జూచుటకు గోసుందకు రాఁగా రాణావారిం, గొలిచి వెఁటఁబోవలసిన దని రాణి సెలవగుటచే వచ్చితిమని వారుత్తర