పుట:Raajasthaana-Kathaavali.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

రాజస్థానకధావళి.


పుత్రులు వారిపట్టుదల కాశ్చర్యమునొంది సరేయని యాయుధ పాణులయి యచ్చట నే నిల్చి యాట ముగిసిన వెనుక తురకల నరికిరి.

కోటస్వాధీన మయినదని వారు రాణాకు వత౯మాన మంప నతఁడు తక్షణమే యచ్చోటికిం బోయెను. పోయి చూచునప్పటికిఁ గోటలోపలను 'వెలుపలను, గుమ్మముకడ, బురుజులమీఁదను తన నమ్మినబంట్లు పీనుంగలయి పడియుండిరి. సలుంబ్రాయొక్క శవము పగతుర మధ్యమున గానఁబడియె. అచలుఁడు నలుగురు తమ్ముల నడుమ వీరశయన మలంకరించె. అందులో బలుఁడు మాత్రము, రాణా వచ్చునప్పటికీ కొనయూపిరితో నుండియెట్టెటో సలాము చేసి "దానద్యయము నష్టచతుష్టయ” మ్మని పల్కి ప్రాణమువదలెను. తనకతమున నిష్కారణముగా నంతటి మహాబలి శాలి మృతినొంచవలసివచ్చేనని రాణా తద్దయు విచారిం చెను.

ఆదినము మొదలు సూక్త వతులు యుద్ధరంగమున “ దానద్యయము నష్టచతుష్టయ" మ్మని కేకలు వేయుచు వచ్చిరి.బలుఁ డవసాన సమయమునఁ బల్కిన యానిష్ఠురంపుఁ బల్కులే యాతెగ వారి కందఱకు జయనాద మయ్యెను, చందావతుఁ డే ముందుగాఁ గోటఁ బ్రవేశించుటచే రాజసేన నడుపు నధికారము వానికే చెందెను.

ఉమ్రా చేసిన తెలివితక్కువ వలన మహావీరులు మహా సాహసులు పలువురు నిష్కారణముగ నిధన మొందిరి. బలుఁ డన్న మాటలకర్థ మదియే. దానద్వయ మనగా నొక విషయముననే రెండు దానములు చేయుట, నష్ట చతుష్టయ మనఁగా నాలుగు రెట్లు నష్టమని యర్థము. నాఁడు మొదలా రెండు తెగలకు మితిమీరిన మనస్పర్థ పొడమెను. అందుచే రాజస్థానమునకుఁ దురకలవలనఁ గలిగిన యాపదకంటె వీరి మనస్పర్థలవలన నెక్కుడాపద సంభవించెను.