పుట:Raajasthaana-Kathaavali.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హళ్డిగట్టు యుద్ధము.

155


పక్కలనున్న యినుప పలక మూలమున సలీము బ్రతుకఁ గలిగెను. గాని లేకున్నచో ప్రతాపుని బాణప్రహారముల చేత చక్రవతి౯ పుత్రుఁడు నాఁడే కడ తేఱియుండును. అప్పుడు పోరు మఱింత సందడి యయ్యెను. చక్రవతీ౯ కుమారుని రక్షించుటకు మొగలాయి సేన లన్నియు నచ్చటికివచ్చే. రసపుత్రవీరు లందఱు తమ స్వామికి బాసటయై నిలిచిరి. ప్రతాపుఁడు మూఁడుబల్లెపు పోటులచేతను మూఁడు కత్తి దెబ్బల చేతను గాయములనుండి నెత్తుకు సంతత ధారగఁ గాఱు చున్నను లెక్క సేయక పోరుచుండ నొక తుపాకి గుండు కవచమును భేదించుకొని వానిశరీరమునఁ జొచ్చెను. ప్రతాపుని గుఱ్ఱము కైటక మామదగజమును డీకొన నింతలో నామదపు టేనుఁగు దెబ్బలచే నొడలునొచ్చి పిచ్చి యెత్తినట్లు విజృంభించి వేఱోక యెడకుం బాఱి పోయెను. అందుచే సలీము పులినోటి కండవలె దాఁటి యావలంబడియె.

మొగలాయి సైనికులు మిడతల దండువలె రాజపుత్రులం జుట్టుముట్ట నారంభించిరి. ప్రతాపుఁడు ముమ్మారు పగతులచేఁ జుట్టు ముట్టబడియు ముమ్మాఱును వారిం దనశక్తికి బలియిచ్చి యప్రతిహతుఁడై నిలిచెను. రాజపుత్రులు క్రమక్రమంబుగ నశించుటయుఁ దురక సేన నెందఱుబంట్లు వచ్చిన నిసుక పాతరవలె తఱఁగకుండుటయుఁ జాలవంశస్థుఁడగు నొక రాజపుత్ర వీరుఁడు చూచి ప్రతాపుని యపాయస్థితినిఁ దప్పించుటకు సూర్యబింబధ్వజమును తన చేతం బట్టుకొని గబగబ పఱుగెత్తేను. తురక సైనికులది చూచి ధ్వజ మెక్కడనుండునో రాణాయు నక్కడనే యుండుననుకొని జాలవంశస్థుని వెంటఁబడిరి. ఇంతలోఁ గొందఱు రాజపుత్రులు ప్రతాపుని గుఱ్ఱపుకళ్ళెమును బట్టుకొని దాని కిష్టము లేకున్నను రణరంగము నుండి వాని నవ్వలకుఁ దీసికొని పోయిరి.