పుట:Raajasthaana-Kathaavali.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు మూడవముట్టడి.

121


నితో స్నేహము చేసికొనుట కష్టము లేదని ప్రత్యుత్తరము చెప్పెను. అనంతరము చక్రవతి౯ మార్యారు సంస్థాన ప్రభువగు రావుమాల్దీవును దోడుపడుమని యడగ నతఁడు సహాయముఁ జేయకపోవుటయే గాక మీదుమిక్కిలి యాహుమాయూనుం బట్టి చెరసాలలో బెట్టింపఁ బ్రయత్నించెను. ఆచక్రవతి౯ రాజ్యభ్రష్టుడై తిరుగుచున్న కాలముననే యెక మహమ్మదీయ యోగికూఁతురు హామిడా యనునామె వానిని మోహించి తినుట కన్నము నిలుచుటకు నీడలేని యారాజును వివాహము చేసికొనియెను. మంచియవస్థలోనున్నపు డెందఱు భార్యలైన రావచ్చును. దురవస్థలో నున్నపుడు మరల రాజ్యప్రాప్తియగుననియైన లేనపుడు తన యంతనేవచ్చి తనతోఁ గలిసి తన కష్టములనే యనుభవించుటకుఁ దన్ను వివాహమాడిన యాకాంతను వెంటఁ బెట్టుకొని హుమాయూను ప్రాణభీతిఁ బగుగెత్త నారంభించెను.

ఆ బాలిక కష్టదినములు వెంటనే బయలుపడెను. దేశమునందెచ్చటఁ దలఁ దాఁచుకొనుటకు వీలు లేక యాదంపతులు స్వసంరక్షణ నిమిత్తము సింధు దేశపు జెడారిం బ్రవేశించిరి. ఈయెడారి నీళ్ళు లేని సముద్రమయి యంతము లేనిదై యుండెను. ఇందు ప్రచండ వాయువు లప్పుడప్పుడు వీచుచుండును. ఆగాడ్పులు విసరునపు డిసుక నేలనుండి నూరుగుల యెత్తువరకుఁ బెద్ద కెరటములాగున లేచి బాట సారులను మట్టిలో గప్పి చంపి వేయును. అక్కడక్కడ నెన్నో యామడల కొకచోట నొకనూయి యుండును. అది రమారమి యెనుబది నిలువులలోతు గలిగియుండును. అందుచే నాయెడారిలో నీరుదొరకనే దొరకదు. ఇట్లు దుర్గమమగుట చేతనే యీ యెడారి మరణభూమి యని పేరు గలగినది ఎంతో జాగ్రత్తతోఁ బోయిన వారికే యనేక యాపదలు సంభవించు చుండును. ఇట్టి భయంకరప్రదేశమును,కోత్తభార్యను, కోలది పరిజనమును వెంటఁ బెట్టుకొని హుమాయూను ప్రవేశించెను. నడచిన కొలఁది మధ్య మధ్య వారికి యెండమావు లగపడి బ్రమ పెట్టి మోసముచేయుచు వచ్చినవి.