పుట:Punitha Matha.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసి ఉద్ధరణం కలిగించారు. ఇక, ఈ రెండవ ఆదాము దేహం మోక్షంలో మహిమను పొందింది. అతనితో కలిసి రక్షణరంగంలో కృషి చేసిన రెండవ యేవ దేహం కూడ మహిమను పొందాలి. అలా పొందడమే మరియ మాత ఉత్థాపనం.

క్రీస్తుకి ఆ తల్లిపట్ల అపార గౌరవము ప్రేమా వుంటుంది. తన్ను ధరించిన ఆ పునీత దేహం క్రుళ్లి పురుగులకు మేతైపోవడానికి, మన్నై పోవడానికి, క్రీస్తు అంగీకరిస్తాడా? తన్ను కని చనుబాలతో పెంచి, ముద్దాడి పెద్దజేసిన ఆ తల్లి పునీత దేహాన్ని ఆ కుమారుడు ఎలా గౌరవించాలో అలాగే గౌరవించి తీరుతాడు. జీవవంతుడైన దేవుడు ఆమెకు జీవమిచ్చి వెలుగులోకి తీసుకపెళ్లాడు. క్రీస్తు ఎక్కడవుంటే ఆ తల్లి అక్కడే వుంటుంది. క్రీస్తును గౌరవించాక ఆ తల్లిని గౌరవించాలి. పూర్వవేదపు మందసం కొయ్యలాగ ఆమెదేహం చెరుపు నెరుగదు.

దేహాత్మలతో మోక్షం జేరుకొనిన మరియను ముగురు దైవవ్యక్తులు ఆదరించి మహిమ పరుస్తారు. దేవునికి తల్లియైనందుకు తగినట్లుగా, మన రక్షణంలో పాల్గొన్నందుకు తగినట్లుగా, ఆ సర్వమంగళను సన్నుతిస్తారు. నీతిమంతులు ఏలాంటి మహిమను పొందుతారో మనం ఊహించనైనా ఊహించలేం అంటాడు పౌలు. జీవితమంతా పాపం విడనాడి నిర్మల జీవితం జీవించిన మరియకు ఏలాంటి మహిమ సిద్ధిస్తుందో మనం మాత్రం ఊహించగలమా? పునీతులు, కన్యలు, స్తుతీయులు, వేదసాక్షులు, దేవదూతలు మొదలైన వాళ్లందరి కంటె ఆమె స్థానం గొప్పది. వాళ్లందరికీ ఆమె రాజ్జి, చుక్కలన్నిటికంటె సూర్యుడెక్కువ. మోక్షవాసులందరికంటె మరియమాత యొక్కువ. అన్నిగ్రహాలూ హజ్ఞ వెలుగును పొందుతాయి.