పుట:Prasarapramukulu022372mbp.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

ప్రసార ప్రముఖులు.

నిర్వహించాడు, ఎం. ఏ. పట్టభద్రుడైన శ్రీనివాసులు కడప కేంద్రంలో 75 లో అనౌన్సర్‌గా చేరి 1980లో ప్రొడ్యూసర్ అయ్యాడు. కడప, మదరాసు కేంద్రాలలో పనిచేసి 1994లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా అనంతపురం బదలీ అయ్యాడు. తర్వాత కడపకేంద్రం వచ్చాడు. మిమిక్రీ కళాకారుడుగా జానపద ప్రయోక్తగా శ్రీనివాసులు భావుకుడు. కొంతకాలం ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి సభ్యులు.

స్నేహసౌహార్దాలకు ప్రతీక వై. గంగిరెడ్డి హైదరాబాదు కేంద్రంలో ఫారంరేడియో రిపోర్టర్‌గా చేరి 1978లో విశాఖపట్టాణానికి F R O గా వెళ్ళారు. అక్కడ దశాబ్దికిపైగా పనిచేసి తిరుపతి బదలీ అయ్యారు. 1993లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా కడప బదలీ అయ్యారు. బి. యస్‌సి (అగ్రికల్చర్) పూర్తిచేసిన గంగిరెడ్డి చిత్తూరు జిల్లాలో జన్మించారు. స్వయంగా రైతుకుటుంబంలో నుండి వచ్చారు గాన రైతుకార్యక్రమాలపట్ల చక్కని అవగాహన.

పి. వెంకటేశ్వరరావు అనబడే సుమన్ హిందీలో ఎం. ఏ. బి. యిడి. పూర్తిచేసి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (స్క్రిప్ట్)గా చేరారు. 1979లో విద్యా ప్రసారాల విభాగం ప్రొడ్యూసర్ గా రిక్రూట్ అయ్యారు. విజయవాడ, అదిలాబాద్ కేంద్రాలలో పనిచేశారు. సుమన్ 1994లో కడపకేంద్రం అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా బదలీ అయ్యారు. చక్కటి కథా రచయిత సుమన్ కార్యక్రమ రూపకల్పనలో అందవేసిన చేయి. సుమన్ 1996 జూన్ నుండి విజయవాడలో పనిచేస్తున్నారు.

కడప కేంద్రంలో మూడు దశాబ్దాలకు పైగా అనౌన్సర్లుగా శ్రీయుతులు గాడిచర్ల శ్రీనివాసమూర్తి, గుర్రం కోటేశ్వరరావు పనిచేశారు.