పుట:Prasarapramukulu022372mbp.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

45

నిర్వహించిన ముఖ్యకార్యక్రమం 'సంగీత శిక్షణ'. మూర్తిత్రయంతోపాటు, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, పూచి శ్రీనివాస్ అయ్యంగార్, పొన్నయ పిళ్ళెవంటి విద్వాంసుల కృతులతోనూ, అన్నమాచార్య కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థులవారి తరంగాలు, సంప్రదాయశైలిలో బోదించారు.

విజయవాడ కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తి నార్జించి పెట్టిన కార్యక్రమాల్లో 'భక్తిరంజని' ఒకటి. G. P. S. నాయర్ గారు డైరక్టర్‌గా వున్న రోజుల్లో, Dr. బాలాంత్రపు రజనీకాంతరావు గారి నేతృత్వంలో, వీరిరువురి ప్రేరణతో 'భక్తిరంజని' కార్యక్రమ రూపకల్పన జరిగింది. ఇందులో త్యాగరాజు దివ్యనామ కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, రామదాసు కీర్తనలు, తరంగాలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, కర్ణాటక సంగీత బాణీలోని మాధుర్యం విడవకుండా చక్కని సంప్రదాయ శైలిలో పాడించిన ఘనత వోలేటిగారిదే.

కాళహస్తి సంస్థానంలోవుండే మునిపల్లె సుబ్రహ్మణ్యకవి విరచిత అధ్యాత్మ, రామాయణ కీర్తనలు, జొన్నలగడ్డ శివశంకరశాస్త్రిగారి ముఖత:విని స్వరం నిర్ధారించి ప్రముఖ విద్వాంసుల చేత పాడించటంలో వోలేటి గారు చేసిన కృషి శ్లాఘనీయం. కర్ణాటక సంగీత విద్వాంసుడు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, నాట్యాచారులు చింతాకృష్ణమూర్తిగారి లాంటి వారి సహకారంతో శశిరేఖా పరిణయం, రామనాటకం, ఉషాపరిణయం, రుక్మాంగద చరిత్రము, ప్రహ్లాద, హరిశ్చంద్ర, మార్కండేయ లాంటి యక్షగానాలెన్నో రూపకల్పన చెంది వోలేటి గారి కృషిని చాటాయి.

హిందూస్థానీ ఉస్తాదులకు తమ పాట కచేరిలలో, కర్ణాటక సంగీతపు బాణీలో ఒక్కపాటైనా పాడే సంప్రదాయం లేదు. కానీ, కర్ణాటక సంగీత కచేరీలలో చివరి భాగంలో హిందూస్తానీ బాణీలో టుమ్రీ, గజల్, భజన్ పాడే అలవాటు స్థిరంగా నిలిచింది. హిందూస్తానీ బాణీ పాడగలిగే గాయకులు, ఆంధ్ర, తమిళ, కర్ణాటక ప్రదేశాలలో చాలామంది వున్నారు.

వోలేటి వారందరిలోనూ మేటి. మరెవ్వరికీ ఆపకడ్ స్వాదీనం కాలేదు. హిందూస్తానీ గాయకులలో అమీర్ ఖాన్, బడేగులాం అలీఖాన్, గులాం అలీ వంటి గాయకులనాదర్శంగా భావించి, చిన్ననాటి నుండి అలవాటైన స్వరజ్ఞానం, గాత్ర సౌలభ్యం, తోడురాగా శ్రీవోలేటికి హిందూస్తానీ గాయకులను కూడా అలరింప గలిగిన బాణీ అలవడింది.