పుట:Prasarapramukulu022372mbp.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

ప్రసార ప్రముఖులు.

వోలేటి గారి కంఠంలో త్రిస్థాయిలూ పలికేవి. పరమ శృతి శుద్దం. అటూ యిటూ అసియాడని లయ.

ఎంత క్లిష్టమైన సంగతులైనా సునాయాసంగా పలికేవి. పాడుతున్నప్పుడు ముఖవర్చస్సు కొంచెం కూడా మారేదికాదు. గోముఖంలో నుంచి గంగ వెలువడినట్లు, ఆయన సంగీతం ధారగా వచ్చేది రాగాలాపనలో మధ్యమ, దురిత కాలపు సంచారాలు అవలీలగా పలికి ఆశ్చర్యం గొలిపేవి.

వోలేటిగారిది ప్రత్యేకమైన సొంత బాణీ.

బందా కనకలింగేశ్వరరావు 1907-1968

బందా కనకలింగేశ్వరరావు 1907లో కృష్ణాజిల్లా ఆటపాకలో జన్మించారు. మద్రాసులో లా పట్టభద్రులై 1934 నుండి ఏలూరులో కొంతకాలం న్యాయవాద వృత్తి చేశారు. ఏలూరు తాలూకా బోర్డు సభ్యులయ్యారు. నాటకాలు ఆయనకు ఆరవప్రాణం. బందా కృష్ణుడు, సారంగధరుడు, బిల్వమంగళుడు పాత్రలలో పేరుతెచ్చుకొన్నాడు. ఒకసారి బళ్ళారిలో చిత్రవశీయం నాటక ప్రదర్శనలో బాహుకుడి పాత్ర పోషించారు బందా. బళ్ళారి రాఘవ బందాని బహుధా ప్రదర్శించారు.

బందా పౌరాణిక, చారిత్రక నాటకాలు ఎన్నో ప్రదర్శించారు. వివిధ పాత్రలు పోషించారు. కర్ణుడు, కణ్వుడు, రాముడు, అభిమన్యుడు, సారంగధరుడు, ప్రతాపరుద్రుడు, గిరీశం, అల్లూరి సీతారామరాజు పాత్రలు సమర్థవంతంగా నిర్వహించే వారు. బందా వారి తండ్రి శ్రీశైలంగారు కొల్లేటిలంకలకు కరణం బందరులో బి. ఏ. పూర్తిచేసి, మదరాసు లా చదివారు. ఏలూరులో న్యాయవాదిగా ఉండగా తాలూకా బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. అప్పుడే ప్రభాత్ ధియేటర్స్ పేర ఒక నాటక సమాజం స్థాపించి 40 ఏళ్ళపాటు నాటకరంగ సేవ చేశారు.

1935లో చిత్రసీమ ప్రవేశం చిత్రంగా జరిగింది. ద్రౌపదీ మానసంరక్షణంలో బందా కృష్ణపాత్ర ధరించారు. తర్వాత తర్వాత సారంగధర, కాలచక్రం, పాదుక, బాలనాగమ్మ చిత్రాలలో నటించారు. అక్కడి అలవాట్లు నచ్చక 1942లో తిరిగి ఏలూరు రాక తప్పలేదు. నాటకరంగ పరిశీలన కోసం 1955లో రష్యా, పిన్లెండ్, చెకొస్లోవాకియా దేశాలు పర్యటించారు.