పుట:Prasarapramukulu022372mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

27

కేశవ పంతుల నరసింహశాస్త్రి:

కె.వి.ఎన్. శాస్త్రిగా ప్రసిద్ధులైన కేశవ పంతుల సంస్కృత పరిచయం ద్వారా ఆంధ్ర శ్రోతలకు సుపరిచితులు. వీరు హైదరాబాదు కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఒక దశాబ్ధి పైగా పనిచేసి పదవీ విరమణ చేశారు. హైదరాబాదులో 91లో కాల ధర్మం చెందారు.

గొల్లపూడి మారుతీరావు:

G.V.S.M.L. నారాయణరావు విశాఖ పట్టణంలో 1939 ఏప్రిల్ 14న జన్మించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయములో M.Sc.,(Mathematical physics) చేశారు. 1961-63 మధ్య కాలంలో ఆంధ్ర ప్రభ (చిత్తూరు) లో సబ్ ఎడిటర్ గా పని చేశారు. మారుతీ రావు రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నాటక రచయితగా నటుడుగా పేరు పొందారు.

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్ గా 1963 లో చేరారు. ఎందరో మహామహులు అప్పుడు ఆకాశవాణిలో పని చేస్తున్నారు. దాశరధి, దేవులపల్లి, స్థానం, మునిమాణిక్యం ఇలా ఎందరో వారితో కలిసి పని చేశారు. అప్పుడే చక్ర భ్రమణం నవలను "డా: చక్రవర్తి " సినీ కథకు మాటలు వ్రాసి సినీ రచయితగా స్థానం సంపాదించారు. వందలాది సినిమాలకు కథ, మాటలు సమకూర్చారు.

1981 లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా నటుడుగా సినీ రంగ ప్రవేశం చేసి 81..96 మధ్య కాలంలో మూడు వందల పైగా సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి బహుమతులందుకున్నారు.

ఆకాశవాణి సంబల్ పూర్, మదరాసు, కడప కేంద్రాలలో ప్రొగ్రాం ఎగ్జిక్యూటివ్ గా రెండు దశాబ్దాలు పని చేశారు. 1980 లో ASD గా పదోన్నతి పొంది 1982లో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. 1970-80 మధ్య కాలములో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పని ఛేశారు. కథారచయిత, వ్యాసరచయిత, నటుడు, నాటక రచయిత సినీరచయిత గా మారుతీరావు బహు ముఖ ప్రజ్ఞాశాలి. మారుతీరావు మదరాసులో స్థిరపడ్డారు.

మారుతీరావు రచనలపై వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశీధన చేసి డా. యం. రజని పి.హెచ్.డి పట్టా పొందారు. వీరు రచించిన కళ్ళు నాటిక ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీచే 1975 ఉత్తమ నాటక రచయిత బహుమతి పొందింది. 'కళ్ళు' సినిమాగా రూపొందించబడి 1989 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు పొందింది.