పుట:Prasarapramukulu022372mbp.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

ప్రసార ప్రముఖులు.


మరో ప్రముఖ వ్యక్తి డా॥ ఆరెకపూడి రమేష్ చౌదరి. ఆయన హిందీ విభాగం డిప్యూటీ ఛీఫ్ ప్రొడ్యూసర్ గా (ప్రవచన శాఖ) ఢిల్లీలో పని చేశారు. చివరి రోజుల్లో మదరాసు కేంద్రంలో పనిచేసి పదవీ విరమణ చేశారు.

విదేశీ ప్రసార విభాగంలో చాలాకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన కుమారి ఉషారావు మొసలికంటి తిరుమలరావు గారి పుత్రిక. ఆమె E. S. D. లో సబ్ ఎడిటర్ గా పనిచేసి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా రిటైరయ్యారు.

P. R. రెడ్డి, శంకరమంచి సత్యం డిప్యూటీ డైరక్టర్లుగా (1988-90) E. S. D. లో పనిచేశారు. E. S. D.లో (విదేశీ ప్రసార విభాగం) పనిచేసిన మరో ప్రముఖుడు R. C. రాజశేఖర్, రాయప్రోలు సుబ్బారావు (ప్రముఖ కవి) కుమారులు. వివిధ హోదాలలో బెంగుళూరు తదితర కేంద్రాలలో పనిచేశారు. E. S. D. లో డిప్యూటీ డైరక్టర్ గా పనిచేసి డైరక్టరేట్‌లో వ్యవసాయ కార్యక్రమాల జాయింట్ డైరక్టర్ గా పనిచేశారు. రాజశేఖర్ ఢిల్లీలో హఠాన్మరణం చెందారు. ఆకాశవాణిలో తొలినాళ్ళలో చేరి సమున్నత స్థానాన్ని పొందిన వ్యక్తులలో ఆయన ఒకరు. ఆయన బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేశారు.

డా. ఆర్. అనంత పద్మనాభరావు ప్రవచన శాఖ డైరక్టర్ ఆఫ్ ప్రోగ్రాంగా 1988 వ సంవత్సరంలో డైరక్టరేట్‌లో పనిచేశారు. డైరక్టరేట్ అనుబంధ సంస్థ అయిన శిక్షణా సంస్థలో 1987-90 మధ్యకాలంలో డిప్యూటీ డైరక్టర్‌గా వ్యవహరించారు.

శ్రీమతి వాణీజయరాం డైరక్టరేట్‌లో సంగీత విభాగం ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. వీరు ప్రసిద్ధ సంఘ సేవకురాలు మోహినీగిరి గారి తల్లి. వీరివలె ప్రస్తుతం శ్రీమతి G. వైదేహి సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు.

ఈమని శంకరశాస్త్రి

శంకరశాస్త్రి పేరు వినగానే వీణాతంత్రులు మీటుతూ గంధర్వరాగాలను సంగీత రసజ్ఞుల కందించిన ఒక విరాట్ మూర్తి మన కళ్ళ ఎదుట ప్రత్యక్షమవుతారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతి వహించిన వైణికులు. 1923 ప్రాంతాలలో తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఒక విద్వత్ కుటుంబంలో శంకరశాస్త్రి జన్మించారు. తండ్రి అచ్యుతరామశాస్త్రి సుప్రసిద్ధ వైణికులు.