Jump to content

పుట:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజ్ఞాప్రభాకరము

7

కొని పది కొట్టక పూర్వమే సుఖముగా భోజనము చేసి, విశ్రాంతితో విద్యార్థులకు పాఠములు చెప్పుటతో శ్రీవారు సత్కాలక్షేపము జరుపుచుండిరి. పది గంటలలోగా భోజనము కానిచో వారి కొంటికణత తలనొప్పి వచ్చును. వా రతి సుకుమారశరీరులు. వారిని గూర్చి మా తండ్రిగారిని గూర్చి నాఁడు మా యూరి వా రిట్లు వాకొనుచుండువారు. రామావధానులు గారికి తన కనారోగ్యము కలుగుట ఊరి కంతకు అనారోగ్యము కలుగుట - సుందరశాస్త్రిగారికి తన కుటుంబమున కనారోగ్యము కలుగుట యూరి కంతకు ననారోగ్యము కలుగుట - అని. తమ, తమ కుటుంబపు టనారోగ్యాములకు వీరు గజిబిజి పడునంతగా ఇతరుల యనారోగ్యముల గూర్చి వీరు గజిబిజి పడువారు కారనుట దీని తత్త్వము.

మా యింటి దగ్గఱనే సాలెవీథిలో సాలెవారు వారి గురు వగు భావనఋషికి ఉత్సవము జరుపుచుండరి. నా వయస్సప్పటికి ఎనిమిదో తొమ్మిదో ఉండును. సంజవేళ 7, 8 గంటలప్పుడు భోజనము చేసి అక్కడ జరుగుచున్న యుత్సవమును జూచుట కేగి యట్టట్టే నేను మైమఱచి నేల వ్రాలిపోయితిని. అక్కడివారు మైమరుపాటు కలుగుచుండుట నావల్ల విని నన్నింటికి గొనివచ్చిరి కాబోలును! ఎంతసే పయినదో! మా తండ్రిగారు దగ్గఱ శివకవచము పారాయణ చేయుచుండగా మెలకువ వచ్చెను. నా కేమియు బాధ గోచరింపలేదు. అంతే. అటుపై సాధారణముగా జాతర్లకు, దేవోత్సవములకు నే నంతగా వెళ్ళ నుత్సహింప కుండుటే జరుగుచు వచ్చినది. పై