పుట:Prabodhanandam Natikalu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కామేశం :- జీవునికి పెద్ద ఎవరు? ఎక్కడుంటాడు? ఏమి చేస్తుంటాడు?

వేణు :- జీవునికంటే పెద్ద ఆత్మయే, ఆత్మ సర్వశరీరాల్లోను తల మొదలు గుధస్థానము వరకు వ్యాపించిన బ్రహ్మనాడియందుండును. ఈ ఆత్మ సర్వశరీరాల చైతన్యకారణమై ఉంటూ కర్మప్రకారము శరీరముతో పని చేయిస్తుంటుంది.

కామేశం :- ఆఖరు ప్రశ్న వీరిద్దరికన్నా పెద్ద ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? ఎక్కడుంటాడు?

వేణు :- వీరిద్దరికన్నా పెద్ద పరమాత్మ, సమస్త విశ్వమూ వ్యాపించి, ప్రకృతికధినేతయై, చరాచర ప్రకృతిని తన స్వాధీనమందుంచుకొని, సృష్ఠి, స్థితి, లయలకు కారణమైవుంటూ, గమనిస్తే మన శరీరమందే ఉన్నాడు.

కామేశం :- భేష్‌రా అల్లుడూ! భేష్‌! నేనింతవరకు ఎందరో స్వాముల్ని, సన్యాసుల్ని, వేదాంతుల్ని తరచి చూచినాను. ఎవ్వరు చూచినా, నేనడిగిన ప్రశ్నలకు శరీరం బయట చెప్పుతారు. కానీ శరీరాంతర్గతంగా ఇంత సక్రమంగా చెప్పినవారులేరు. ఇంతటితో నేను నా నాస్తికవాదాన్ని కట్టి పెట్టుతున్నాను. కాని శరీరములోనే దేవుడు ఉన్నాడని నిరూపణగా చెప్పగలవా?

వేణు :- మామయ్యగారు, నీముక్కు రంధ్రాలలో పైకిక్రిందికి ఆడుతున్న శ్వాస ఎలా ఆడుతోంది, ఏ ఆధారంతో ఆడుతోంది?

కామేశం :- (ముక్కు శ్వాసను పైకి క్రిందికి ఆడించి) నేను పీల్చుకుంటున్నా బయటికి వదలుతున్నా.

వేణు :- ఇపుడు మెలకువలో ఉన్నావు కాబట్టి నీవు పీల్చుకుంటున్నావు వదలుచున్నావు, నీవు నిద్ర పోయినపుడు ఎలా ఆడుతుందంటావు?