పుట:Prabodhanandam Natikalu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తల్లి అనీ అంటూనే, సముద్రములో ఉన్నప్పుడు సముద్రుడు అంటున్నారు. వీరు చెప్పుమాటలనుబట్టి, కొందరు ప్రజలు నన్ను ఆడకాక, మగకాక రెండింటికి తప్పినవాడని అనుకొంటున్నారు.

పుష్కరాలని పేరుపెట్టి, వీరి స్వార్థముకొరకు శుభ్రముగ పారుచున్న నన్ను అశుభ్రము చేయుచున్నారు. నాలో స్నానముచేస్తే మీపాపాలను కడిగేస్తానని ఎవరికైనా చెప్పియున్నానా? మీరు చేసుకొన్న పాపాలు నా నదిలో స్నానము చేస్తే పోవు అని తెలుసుకొనే దానికి, పుష్కరాలకు వచ్చి తిరిగిపోయే వారిలో కొందరికి నేను రోడ్డు ప్రమాదములు కలిగించి కాళ్ళు, చేతులు విరిగేటట్లు చేశాను. అప్పటికైనా పుష్కరాలలో శరీరము మీద మలినము తప్ప, తలలోని పాపములు పోవని ఎవరైనా తెలుసు కొంటున్నారా? అదియు లేదు. పాపములు పోతే అనుభవించేది ఉండదు కదా! అలాంటపుడు నాకు చేయి ఎందుకు విరిగింది? కాలు ఎందుకు విరిగింది? ప్రమాదము ఎందుకు జరిగింది? అని మేధావులు కూడ ఆలోచించడములేదు. ఎవరూ నిజము తెలుసుకోకుండా పుష్కరాల పేరుతో నన్నూ, యజ్ఞాలపేరుతో అగ్ని, వాయువులనూ బాధించు వీరి మీద, మాకు ఎంతో కోపమున్నా, మేము ఏమీ అనకుండా ఇంకా కొంతకాలానికైనా తెలుసుకుంటారులే అని కొంత ఓర్పుతోనే ఉన్నాము. వీరికి మాలాంటి వారికంటే రావణబ్రహ్మయే సరియైనవాడు. ఎందుకంటే ఆయన యజ్ఞములు చేయడము మంచిదికాదని కొట్టిచెప్పాడు.

(అంతలో ఒకరకమైన శబ్దము ఏర్పడుతుంది. అపుడు రావణ బ్రహ్మయే స్వయముగా అట్టహాసముగా అక్కడికి వస్తాడు.)

భటులు :- అహో! రావణబ్రహ్మ! త్రికాలజ్ఞానీ, బ్రహ్మజ్ఞానీ, దైవాంశ సంభూతా! నవగ్రహములనే శాసించిన శాసనకర్త! ధర్మప్రచారా! అధర్మశత్రూ మీకిదే మా వందనమ్‌.