పుట:Prabodhanandam Natikalu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను చెప్పితే దేవుని జ్ఞానము అర్థమగును, కానీ దేవుడు అర్థముకాడు. దేవుడు అనిర్వచనీయుడు, మాటలకు అందనివాడు. అందులన దేవుని జ్ఞానమునే ఎవరైనా చెప్పవచ్చును. దేవుడు ఫలానా అని చెప్పలేడు. జ్ఞానము ప్రకారము చెప్పాలంటే, ఇక్కడ కనిపించక, సర్వమునకు సూత్రధారియై, జన్మకర్మకు అతీతుడై, మాయ జన్మయెత్తి, మాయ శరీరములోనున్న ఈ కృష్ణుణ్ణే దేవుడని చెప్పవచ్చును. ఇంతవరకు కృష్ణుడు కూడ దేవుడు కాదన్న మీరే, అదే నోటితో కృష్ణుణ్ణి దేవుడంటున్నారేమిటి అని చాలామందికి ప్రశ్న వచ్చియుండవచ్చును. దానికి నా జవాబు ఏమనగా! మీరు కంటికి కనిపించేదే చూస్తున్నారు. కావున మీకు ఈయన దేవుడుకానేకాడు. నేను కంటికి కనిపించని దానిని, నాకున్న నేత్రములతోకాక, అనేత్రముతో చూస్తున్నాను, కావున నాకు ఈయనే నిజమైన దేవుడు. సంపూర్ణ జ్ఞానమును తెలిసి మరొక జ్ఞాననేత్రము మీరు సంపాదించుకొన్న రోజు, మీకు నిజమైన దేవుడెవరో తెలియగలరు.


మీరు దేవుణ్ణి తెలియాలంటే త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవండి. నేనే దేవుణ్ణి అని ఒకచోట, నేను దేవుణ్ణికాదని మరొకచోట, నేనే అన్నీ చేయుచున్నానని ఒకచోట, నేనేమీ చేయలేదని మరొక చోట, నేను పుట్టేవాడినే కాదు అని ఒకచోట, నాకు అవసరమొచ్చినపుడు పుట్టుచున్నానని మరొకచోట పరస్పర విరుద్ధ వాక్యములను చెప్పిన దేవుణ్ణి కనుగొనండి. ఇక్కడ పరస్పర విరుద్ధ వాక్యములు దేవుని వాక్యములై ఉండునా అని కొందరికి నా మీద అనుమానము రావచ్చును. ప్రశ్న పుట్టించి, వెదికించి, జవాబు దొరికించడము దేవుని విధానము. అందువలన ప్రశ్నతో ఆగవద్దండి. జవాబు కొరకు వెదకండి, అంతటితోనే ఆపకండి, పూర్తి జవాబు దొరికే వరకు వెదకండి అప్పుడు తెలుస్తాడు దేవుడెవరో!