పుట:Prabodhanandam Natikalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అపరిమితుడు, ఎల్లలు లేనివాడు, ఏ కొలతకూ దొరకనివాడని, గీతలో దేవుడు చెప్పిన సూత్రముల ప్రకారము ఎక్కడో ఉన్నవాడు, ఇక్కడలేనివాడు దేవుడు కాడు.


మరికొందరు దేవుడు పరలోక రాజ్యములో నుండి తన ఇష్ట కుమారులను భూమిమీదకు ప్రవక్తలవలె పంపుచు, తన విషయము ప్రజలకు చెప్పునట్లు చేయుచున్నాడని అంటున్నారు. ఆయన గృహములో పని మనుషులు కూడ ఉన్నారని అంటున్నారు. దేవుడు సర్వవ్యాపి అను సూత్రము ప్రకారము, మరియు సర్వజీవరాసులకు నేను తండ్రిని అను సూత్రము ప్రకారము ఆయనకు జంతువులు, పక్షులు, మనుషులు అందరూ సంతతేకాని ఫలానావారే కుమారులను మాట వర్తించదు. పరలోకము ఈ లోకము లోనే కనిపించనిదని తెలియక ఎక్కడో ఉన్నదనుకోవడము పొరపాటు. అందువలన సర్వవ్యాపి, సర్వపిత అను సూత్రము ప్రకారము వారి అంచనా ప్రకారమనుకొన్నవాడు దేవుడు కాడు.


మరికొందరు కంటికి కనిపించేరాయినీ, రాజ్యమేలిన రాజును దేవుడనుచున్నారు. కనిపించే ఆవులో దేవుడున్నాడని కొందరు మ్రొక్కు చున్నారు. అలాగే గుర్తింపు పొందిన మనిషిలో దేవుడున్నాడని కొందరు మ్రొక్కుచున్నారు. ఇతరులను మ్రొక్కువారు ఇతరుల లోనికి, నన్ను మ్రొక్కు వాడు నాలోనికి, చేరునన్న సూత్రము ప్రకారము మనము మ్రొక్కువారందరు దేవుడుకాదని తెలియుచున్నది.


ఇన్ని చెప్పినా దేవుడెవరో చెప్పక ‘‘వీరు అనుకొన్నట్లు కాదు, వారు అనుకొన్నట్లు కాదు అంటున్నారు. మీకు తెలిసిన ప్రకారము దేవుడెవరో తేల్చి చెప్పలేదే’’ అని మీరనుకోవచ్చును. దానికి మా సమాధానమేమనగా!