పుట:Prabodha Tarangalul.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

625. నీకు తెలియకుండానే ఎప్పటికి మారని మతములో, ఎప్పటికి మారని కులములో నీవున్నావు.

626. నీవు ఎప్పటికి మారని జీవకులములో ఉన్నావు. అలాగే ఎప్పటికి మారని దైవమతములో ఉన్నావు.

627. నీ గోత్రము ఎప్పటికి ప్రకృతియే. నీ ఇంటిపేరు ఎప్పటికి కర్మయే.

628. ఇంటి పేరులేనివాడు నిజమైన నీతండ్రి పరమాత్మయే.

629. ఇంటి పేరున్న తండ్రి నీ ఒంటికి సంబంధించినవాడేనని తెలుసుకో.

630. హద్దులేని మనస్సు పద్దులేని కర్మవలన పరుగెడుచున్నది.

631. దంచుతున్న దంతముల మధ్యలో భయములేని నాలుక ఏ విధముగ మసలుచున్నదో, అదే విధముగ కష్టపెట్టు కర్మల మధ్యలో నిర్భయముగ జీవుడుండవలెను.

632. తాను జీవుడైయుండి తన శరీరములోని తన అడ్రస్‌ ఏ జీవునికి తెలియకుండ పోయినది.

633. శరీరమను ఊరిలో తన ఇల్లుగాని, తన పొరుగువానిని గాని తెలియకుండ బ్రతుకుచున్నవాడు జీవుడు.

634. ప్రపంచ జ్ఞానములో రాజుకు పేదకు ఎంత తేడా కలదో, పరమాత్మ జ్ఞానములో బ్రహ్మర్షికి బేవర్షికి అంత తేడాగలదు.

635. ఎంతటి చెట్టుకైన గాలిపోటు తప్పదు. ఎంతటివానికైన కర్మపాటు తప్పదు.