పుట:Prabodha Tarangalul.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

615. ఆకలి కడుపులో బాధ కలిగిస్తుంది. కర్మ తలలో బాధ కలిగిస్తుంది.

616. ధనికుడు వస్తుదానము చేయుట, జ్ఞాని జ్ఞానదానము చేయుట మంచిది.

617. ధనికుడు జ్ఞానదానము చేయుట, జ్ఞాని వస్తుదానము చేయుట ధర్మవిరుద్ధము.

618. శాస్త్రమును పురాణమనడము, పురాణమును శాస్త్రమనడము ఏనుగును ఎలుకయనీ, ఎలుకను ఏనుగుయనీ అన్నట్లుండును.

619. నీకు సరిపోనంత మాత్రమున మంచి చెడుకాదు. అలాగే నీకు నచ్చినంతమాత్రమున చెడు మంచికాదు.

620. కర్మ అంటే అజ్ఞానులకు అర్థముకాదు. కర్మలేనిది ఎవనికి క్షణము కూడ గడవదు.

621. క్షణము గడచినదంటే కర్మలో తృణము తీరి పోయినట్లేనని తెలుసుకో.

622. నీకు వచ్చునవన్ని కర్మనుబట్టి వచ్చును. నీకున్నవి అన్ని కర్మను బట్టి ఉన్నవి. నీకు పోయినవన్ని కర్మనుబట్టి పోయినవి.

623. నాది అనుకొను నీ కులము ఏదో నిజముగ నీకు తెలుసునా? మధ్యలో ఏమైనా మారిందేమో!

624. నాది అనుకొను నీ మతమేదో నీకు నిజముగ తెలుసునా? మధ్యలో ఏమైనా మారిందేమో!